Wednesday, September 12, 2012

నలభైల్లో మంచి ఆరోగ్యం కోసం...


ఆరోగ్య సంరక్షణ అన్నది అందరికీ వర్తించినా, నలభైకి చేరువ అవుతుంటే మాత్రం వారు మరింత జాగరూకతతో ఉండాలి. సాధారణంగా ఆ వయసులో డయాబెటిస్, రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, గుండె సంబంధిత వ్యాధులు, ఆస్టియోపోరోసిస్ వంటివి కనిపిస్తాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోడానికి మనం మంచి జీవనశైలి అంటే...మంచి ఆహారం, వ్యాయామం, చెడు అలవాట్లను విసర్జించడం వంటి అంశాలపై దృష్టినిలపడం అవసరం. 

మంచి ఆహారం ఆవశ్యకత: మన ఆహారంలో కాయధాన్యాలు, తాజా పండ్లు, ఆకుకూరలకు ప్రాధాన్యం ఇవ్వాలి. నూనె పదార్థాలను వీలైనంత తగ్గించాలి. పీచు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. కొలెస్ట్రాల్, చక్కెర పాళ్లు తక్కువగా ఉండేలా చూసుకోవడం శ్రేయస్కరం. 

ప్రతిరోజూ వ్యాయామం : నలభైల్లో ఉండేవారు ప్రతిరోజూ వ్యాయామం చేయడం చాలా ముఖ్యం. ఫిట్‌నెస్‌ను దీర్ఘకాలం కాపాడుకోవడానికి వ్యాయామం ఎంతో అవసరం. అందునా శరీరాన్ని అతిగా కష్టపెట్టే బాడీ బిల్డింగ్ వ్యాయామాల కంటే తేలికపాటి శారీరక శ్రమ కలిగించే నడక వంటివి మంచి వ్యాయామ ప్రక్రియలని గుర్తుంచుకోవాలి. వారంలో కనీసం ఐదు రోజుల పాటు రోజూ 45 నిమిషాల పాటు నడవడం చాలా మంచిది.

చెడు అలవాట్లకు దూరంగా ఉండటం: పై జాగ్రత్తలతో పాటు పొగతాగడం, మద్యపానం, పొగాకు ఉత్పాదనలను నమలడం వంటి అనారోగ్యకరమైన అలవాట్లకు దూరంగా ఉండటం వల్ల మంచి జీవనశైలిని పాటించినట్లవుతుంది. దాంతో మంచి ఆరోగ్యం సమకూరుతుంది. 

హోమియో చికిత్సా ప్రక్రియలో మనిషి జీవన విధానం, అతడి వయసు, నివసించే ప్రదేశం, ఆహార అలవాట్లు, శారీరక లక్షణాలు, మానసిక దౌర్బల్యాల వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని మందులు సూచిస్తారంటే జీవనశైలికి హోమియో విధానం ఎంత ప్రాధాన్యం ఇస్తుందో తెలిసిపోతుంది. పైగా హోమియో విధానం స్వాభావికంగా వ్యాధినిరోధక శక్తిని పెంపొందించి వ్యాధులను దూరం చేస్తుంది. ఇక జీవనశైలి సైతం స్వాభావికంగానే వ్యాధి నిరోధకశక్తిని పెంపొందిస్తుంది. కాబట్టి నలభైల్లో ఉన్నవారు ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించాల్సిన ఆవశ్యకత ఉంది. 

No comments:

Post a Comment