Friday, January 11, 2013

వింటర్ సీజన్ లో మీ పాదాలకు - కొన్ని జాగ్రత్తలు

చలికాలంలో మన పాదాలు, చేతులు రంగుమారిపోతాయి. పగుళ్లు వచ్చి అశయంగా కనిపిస్తాయి. వీటిపై సంరక్షణ తీసుకుంటే పాదాలు, చేతులను కోమలంగా ఉంచగలుగుతాం. చలికాలంలో పాదాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ కాలంలో కాలి మడమలపై పగుళ్లు వచ్చి సమస్య మరింత పెరుగుతుంది. అదే డయాబెటిస్ ఉన్నవారికైతే ఈ సమస్య వచ్చినప్పుడు అదే తీవ్రమయ్యే ప్రమాదం ఉంది.

అంతే కాదు ఈ సీజన్ లో ఎక్కువగా పొడిబారడం జరుగుతుంది. చర్మం అతి త్వరగా పొడిబారి, పగుళ్ళు ఏర్పడి, చారలు కనబడుతుంటాయి. కాళ్ళు మరింత అసహ్యంగా కనబడుతాయి. కాబట్టి... ఈ కాలంలో పాదాలను జాగ్రత్తగా ఉంచుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అందమైన పాదాలు సొంతం చేసుకోవాలంటే 15 రోజులకోసారి పెడిక్యూర్ చేయించాలి. పెడిక్యూర్ కోసం పార్లర్‌కు వెళ్లలేని వారు ఇంట్లో దొరికే వస్తువులతోనే పెడిక్యూర్ చేసుకోవచ్చు.

గోరు వెచ్చని నీటిలో కొంచెం ఉప్పు, హైడ్రోజన్‌పెరాకె్సైడ్ లేదా డెటాల్, షాంపూ వేయాలి. అందులో 15 నుంచి 20 నిమిషాలపాటు కాళ్లను నానబెట్టాలి. బయటకు తీసి ప్యూమిక్‌స్టోన్ లేదా స్క్రబ్బింగ్ స్టోన్ లేదా బ్రష్ ఉపయోగించి రుద్దాలి. దీనివల్ల పాదాలపై ఉన్న మృతకణాలు తొలగిపోతాయి. తరువాత ఒక నిమ్మకాయ చెక్క తీసుకుని దానిపై గ్లిజరిన్ వేసి బాగా రుద్దాలి.

అనంతరం ఆలివ్ ఆయిల్‌తో కాలును మొత్తం మసాజ్ చేయాలి. అనంతరం పాదాలకు సాక్స్ వేసుకోవాలి. ముల్తానీ మట్టిలో గులాబీనీరు కలిపి పాదాలకు పూత వేసి.. పావుగంటయ్యాక కడిగి మాయిశ్చరైజర్‌ రాయాలి. తరచూ ఇలా చేయడం వల్ల చర్మం మీద మృతకణాలు తొలగిపోయి.. మృదువుగా మారతాయి.

గులాబీ నీళ్లు, గ్లిజరిన్‌ సమపాళ్లలో తీసుకొని పాదాలకు మసాజ్ చేయాలి. మర్నాడు గోరువెచ్చటినీళ్లలో షాంపూ కలిపి కడిగితే.. పాదాల మీద మురికి సులువుగా తొలగిపోతుంది. ఫుట్‌క్రీమ్‌కానీ, లోషన్‌గానీ, పాదాలకు రాసుకోవచ్చు. ఫుట్‌లోషన్‌ను ఎలా తయారు చేయాలంటే గాఢమైన రంగున్న సీసాను సిద్ధం చేసుకోండి.

అందులో ఒక చెమ్చా బాదం ఆయిల్‌, ఒక చెమ్చా ఆలివ్‌ ఆయిల్‌, ఒక చెమ్చా వీట్‌ ఓర్మ్‌ఆయిల్‌; 12 చుక్కల యూకలిప్టస్‌ ఎసెన్షియల్‌ ఆయిల్‌ను కలపండి. చల్లని నీడ ఉన్న ప్రదేశంలో దీన్ని వుంచండి. పాదాలను శుభ్రం చేసుకున్న తర్వాత ఆరిపోయాక ఈ ఆయిల్‌ను పట్టించండి. పాదాలను ఎంత శుభ్రంగా ఉంచుతామో కాలి వేళ్ళు, గోళ్ళు కూడా అంతే శుభ్రంగా ఉండటానికి ప్రాధాన్యత ఇవ్వండి. గోళ్ళు తరచూ కట్ చేసుకొంటుండాలి.

ఆ తర్వాత ఒక బకెట్లో పావు భాగం వరకు నీళ్ళు తీసుకుని అందులో ఒక స్పూన్ కొబ్బరి నూనె, ఒక స్పూన్ విటమిన్ ఇ నూనె, చెంచ వంటసోడా వేసి ఒక అరగంట పాటు కాళ్ళు అందులో ఉంచాలి. ఇలా చేస్తే పాదాలు మృదువుగా ఉంటాయి. ప్రతిరోజూ స్నానం చేసేటపుడు కనీసం మూడు నిమిషాలైనా పాదాలకోసం కేటాయించండి. పాదాలను ప్యూమిన్ రాయితో రుద్దితే మృతచర్మం చాలావరకు తొలగిపోతుంది.

ప్యూమిన్ రాయి, నెయిల్ బ్రష్, మంచి స్క్రబ్ కొని తెచ్చుకోవాలి. బ్రష్‌తో గోళ్లలో ఉండే మట్టిని తొలగించవచ్చు. స్నానం పూర్తయ్యాక వేళ్ల మధ్య, అరికాలు పూర్తిగా తుడుచుకుని మంచి మాయిశ్చరైజర్ రాయాలి. పాదాల సంరక్షణలో భాగంగా సాక్సులు వాడుతుంటారు చాలామంది. వాటిని ఎప్పటికప్పుడు శుభ్రపరిచి ధరించాలి. లేదంటే దుమ్ము, మురికి చేరిపోయి చెమట పట్టినప్పుడు పాదాలకు ఇన్‌ఫెక్షన్‌ సోకే అవకాశం ఉంటుంది.

అలానే నైలాన్‌ సాక్సుల కంటే కాటన్‌వి సౌకర్యంగా ఉంటాయి. రాత్రిపూట తప్పనిసరిగా గోరువెచ్చటి నీళ్లతో కాళ్లు కడుక్కొని పొడి తువాలుతో తుడిచి కొబ్బరి నూనె రాయాలి. కొద్దిసేపు పాదాలను మునివేళ్లతో నొక్కుతూ ఉంటే రక్తప్రసరణ చక్కగా జరుగుతుంది. మర్నాటికి పాదాలు మెత్తబడతాయి.   

No comments:

Post a Comment