Saturday, February 9, 2013

వేదకాలంలో "ట్రాన్స్‌పోర్ట్" ఇలా ఉన్నదట..!!

నిశితంగా పరిశీలించినపుడు, 20 శతాబ్దంలో సంభవించిన అనేక శాస్త్రీయ ఆవిష్కరణలు, మన వేదాలలో, పురాణేతిహాస గ్రంథాలలో విపులీకరించబడ్డాయనేది ఎవరు కాదన్నా...యదార్థం! నేటి విజ్ఞానశాస్త్రం వివరించడానికి సాధ్యం కాదంటున్న విషయాలను గురించీ వేల సంవత్సరాల క్రితమే మన పూర్వులు వివరించి చెప్పారు. ఉదాహరణకు ముండకోపనిషత్తులో సృష్టి ఆవిర్భావం గురించి ఇలా వివరించారు.

యధోర్ణనాభిః సృజతేగృహ్ణ తేజ
యథా పృదివ్యా దోషధయః సంభవంతి
యథా సతః పురుషాత్కేశలో మాని
తథాక్షరాత్సంభవంతీహ విశ్వం
సాలెపురుగు ఏ విధంగా తనలోనుండి దారాలను సృష్టించి, మళ్ళీ తనలోకి గ్రహించుకుంటుందో, మానవశరీరంలో నుండి రోమాలు ఏవిధంగా పుడుతున్నాయో, భూమి నుండి ఓషధులు ఏవిధంగా ఉద్భవిస్తున్నాయో, అదేవిధంగా అక్షరుడైన పరమాత్మ వలన ఈ ప్రపంచం పుడుతోంది.

అదేవిధంగా వేదవ్యాసుడు గాంధారి గర్భాన్ని కాపాడేందుకు కుండను ఉపయోగించడం, నేటి టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రయోగంవంటిదన్నమాట అదే విధంగా గణత విజ్ఞాన విభాగాలైన వర్గ సమీక రణాలు, త్రికోణమితి, కలనగణితం గురించి మన పురాతన గ్రంథాలలో వివరణలున్నాయి.

ఇంకా చెప్పాలంటే, గణితశాస్త్రంలో విప్లవాత్మక మార్పులకు కారణమైన పైథాగరస్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన పైథాగరస్ భారతదేశానకి వచ్చి, ఇక్కడ మన గణిత, వేదాంత శాస్త్రాలను అభ్యసించి తన మేధకు పదును పెట్టుకున్నాడన్న విషయం నిజం. అలాగే ఈ శతాబ్దపు మేటి ఆవిష్కరణగా ప్రసిద్ధిగాంచిన "పరమాణుగడియారం" గురించి మన పురాణాలలో తగిన వివరణలున్నాయి.

ఇలా మన వేదసంస్కృతిని ఆకళింపు చేసుకుంటూ పోతే ఎన్నో విషయాలు మనకు గోచరమవుతాయి. ఇక వేదకాలంలో ప్రయాణవిధానాలను పరిశీలించినపుడు 1. రహదారి మార్గం, 2. నదీ, సముద్ర మార్గం, 3. వాయుమార్గం అంటూ మూడు పద్ధతులను మనం గమనించవచ్చు. అదేవిధంగా నేడు నాలుగులేన్ల రోడ్లవలె, నాటి రహదారులు కూడ మూడు విధాలుగా విభజింపబడ్డాయి.

1. పాదచారులు కోసం, 2. ఎద్దుల బండ్ల కోసం, 3. రథాల కోసం - అంటూ ప్రతి ప్రధాన రహదారి మూడు భాగాలుగా విభజింపబడింది. ఆరోజుల్లో ప్రజల రవాణా కోసం ఎక్కువగా ఎద్దుల బండ్లపైనే ఆధారపడేవారు. ఇప్పటికీ మన దేశంలోని గ్రామీణ ప్రాంతాలలో ఎద్దుల బండ్లే ప్రయాణాసాధనాలు.

ఋగ్వేదంలోని మంత్రంలో (1-37-1) స్పోర్ట్స్ కారు ప్రస్తావన ఉంది. అధర్వవేదంలోని మంత్రంలో (2076-2)నేటి పబ్లిక్ ట్రాన్స్‌ఫోర్ట్ సిస్టం గురించిన ప్రస్తావన ఉంది.

ఇక, వాయుయానానికి సంబంధించినంత వరకు రైట్ సోదరులకు కొన్నివేల సంవత్సరాలకు ముందే విమానాల గురించి మనకు తెలుసు. 'సమరాంగణ సూత్రధార' అనే గ్రంథం విమానాలు ప్రయాణించే ఎత్తులు, వేగాలు, అవరోహణం వంటి తారతమ్య లక్షణాల ఆధారంగా దీర్గంగా చర్చించింది. ఒక విమాన నిర్మాణం గురించి ఈ క్రింది విధంగా వివరించబడింది.

విమాన యంత్రాన్ని పాదరసంతో నింపి, పైభాగంలో మంటతో వేడి చేసినట్లయితే, సింహంవంటి గర్జనతో ఆ విమానం శక్తి పుంజుకుని, మరుక్షణంలో ఆకాశంలోకి ఎగిరిపోతుందనేది ఆ వివరణ. ఇలా వాయుగతి శాస్త్ర వివరణలు వేదాలలో ఉన్నాయి.

రామాయణంలో పుష్పక విమానవర్ణనను, దాని వేగాన్ని చూడగలం విశ్వకర్మచే నిర్మితమై పుష్పక విమానం మేరు పర్వతంపై ఉండేది. ఆ విమాన భాగాలన్నీ బంగారంతో చిత్రవిచిత్రంగా అమర్చబడి ఉన్నాయి.

వైఢ్యూర్యమణిమయమైన ఆ విమానం ధగధగా మెరిసి పోతోంది. విమానంలో ఎన్నో వేది కలు, మంటపాలున్నాయి. అంతే కాదు. ఆ విమానంలో కాంచన హర్మ్యలు నిర్మించబడి. వాటి శిఖరాలు స్ఫటికాలు, వైఢూర్యాలతో తాపడం చేసి ఉన్నాయి.

విమాన అంతస్తు కిటికీలకు ముత్యాలు, మణులు, పొదగబడి ఉన్నాయి. దానిపై బంగారు ధ్వజాలు, తెల్లటి పతకాలు తాపడం చేసి ఉన్నాయి. ఆ విమానం ఆకాశంలో మధుర ధ్వనులు చేస్తూ, దానికి కట్టి ఉన్న చిన్న చిన్న గంటలూ, పెద్ద పెద్ద గంటలూ గణగణ మోగుతూ మనోవేగంతో పోసాగింది. ఆ విమానంలో ఉన్న సీతారామ లక్ష్మణులు, సుగ్రీవ సహిత వానర సమూహం, విభీషణ పరివారం ఎక్కి అయోధ్యకు పయనమయ్యారనేది కథ.

No comments:

Post a Comment