Tuesday, June 23, 2015

యముడి కొడుకు యమహా!

ఓసారి యముడు భూలోకానికి వచ్చినప్పుడు ఓ అందాల సుందరిని చూశాడు. ఎలాగైనా ఆమెను పెళ్లి చేసుకోవాలని అతడికి అనిపించింది. వెంటనే మనిషి రూపం ధరించి ఆమెను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. ఆమె అందమైనదే కానీ ఒట్టి గయ్యాళి. పెళ్లయిన మర్నాటి నుంచే చీటికీ మాటికీ అతడిని సాధించేది. ఆమె మీద ఉండే ప్రేమతో యముడు అదంతా భరించేవాడు. కొన్నాళ్లకు వారికో ఓ కొడుకు పుట్టాడు.
కొడుకు యువకుడయ్యేసరికి యముడికి భార్యంటే మొహం మొత్తింది. ఆమె గొంతు వింటేనే కంపరం పుట్టుకొచ్చేది. ఇక ఎంత మాత్రం ఆమెను భరించలేనని నిర్ణయించుకున్న యముడు తన కొడుకును దగ్గరకు పిలిచి జరిగిందంతా చెప్పి, 'ఇక నాకు ఈ జీవితంపై విరక్తి కలిగింది. నా కొడుకుగా నీకొక గొప్ప రహస్యం చెబుతా. నువ్వు వైద్య వృత్తిని ప్రారంభించు. నువ్వు ఏ రోగిని చూసినా అతడికి నయం అయ్యేటట్టు వరమిస్తున్నా. అయితే ఏ రోగి తల దగ్గరైనా నేను కనిపిస్తే మాత్రం వైద్యం చేయకు. ఎందుకంటే వాళ్ల చావు తప్పదన్నమాట' అంటూ అదృశ్యమైపోయాడు. తండ్రి చెప్పినట్టే ఆ యువకుడు వైద్యవృత్తిని చేపట్టి గొప్ప హస్తవాశి కలవాడుగా పేరుపొందాడు. ఓసారి ఆ దేశపు రాకుమారికి తీవ్రమైన అనారోగ్యం ఏర్పడింది. పెద్ద పెద్ద వైద్యులు కూడా నయం చేయలేకపోయారు. రాజు వెంటనే రాజ్యమంతటా చాటింపు వేయించి రాకుమారి జబ్బు తగ్గించినవారికి ఆమెనిచ్చి పెళ్లి చేయడంతో పాటు రాజ్యాన్ని కూడా అప్పగిస్తానంటూ ప్రకటించాడు.
ఆ ప్రకటన విన్న యువకుడు ఉత్సాహంగా రాజధాని బయల్దేరి రాకుమారిని చూశాడు. ఆమెను పరీక్షిస్తూ చుట్టూ చూసేసరికి తలదగ్గర తండ్రి కనిపించాడు. ఆమె చనిపోక తప్పదని అతడికి అర్థం అయింది. రాకుమారిని రక్షిస్తే జీవితాంతం సుఖంగా బతకవచ్చనుకున్న యువకుడికి ఏం చేయాలో తోచలేదు. కాసేపు ఆలోచించిన అతడికి ఓ ఉపాయం తోచింది. వెంటనే గది గుమ్మం వరకూ పరిగెత్తి బయటకి చూస్తూ, 'అమ్మా! త్వరగా రా. నాన్నగారు ఇక్కడే ఉన్నారు' అంటూ అరిచాడు.
కొడుకు కేక వినగానే యమభటుడికి చెమటలు పట్టాయి. గయ్యాళి భార్యను చూడవలసి వస్తుందనే భయంతో చటుక్కున అదృశ్యమైపోయాడు. దాంతో ఆ యువకుడి వైద్యం ఫలించింది. రాకుమారిని పెళ్లాడి, రాజవ్వాలన్న అతడి ఆశ కూడా నెరవేరింది!

No comments:

Post a Comment