Sunday, June 21, 2015

గర్భస్థ శిశువుకు మన మాటలు అర్ధమౌతాయా?

తల్లి గర్భంలో ఉన్న శిశువుకు మాటలు వినిపిస్తాయని, అర్ధమౌతాయని పురాణ కథనాలు అనేకం ఉన్నాయి. ఇవి అతిశయోక్తులు కాదు, ఇందులో నిజం ఉందని ఉదాహరణ సహితంగా తెలియజేశాయి ధార్మిక గ్రంధాలు.
అభిమన్యుడు పెరిగి పెద్దయ్యాక పద్మవ్యూహం గురించి నేర్చుకోలేదని, తల్లి గర్భంలో ఉండగానే అవగాహన చేసుకున్నాడని భారతంలో వర్ణించారు. అర్జునుడు ఒకసారి సుభద్రకు యుద్ధవిద్యలో పద్మవ్యూహం కష్టతరమైనది అంటూ పద్మవ్యూహంలో ఎలా ప్రవేశించాలో, చాకచక్యంగా ఎలా పోరాడాలో వివరించి చెప్పాడు. అప్పుడు సుభద్ర కడుపులో ఉన్న అభిమన్యుడు ఆ విద్యను అర్ధం చేసుకున్నాడు. అయితే, పద్మవ్యూహం నుండి ఎలా బయటపడాలో అర్జునుడు సుభద్రకి చెప్పలేదు. కనుకనే తర్వాతి కాలంలో అభిమన్యుడు యుద్ధంలో చాకచక్యంగా పద్మవ్యూహం ఛేదించుకుంటూ లోనికి వెళ్ళి వీరోచితంగా పోరాడాడు కానీ ఆ వ్యూహం నుండి బయటపడలేక ప్రాణాలు కోల్పోయాడు.
హిరణ్యకశిపుడి కొడుకు ప్రహ్లాదుడు కూడా తల్లి గర్భంలో ఉండగా నారదుడి మాటలు విని ఆకళింపు చేసుకున్నాడని, అందువల్లనే పుడుతూనే విష్ణుభక్తుడు అయ్యాడని చెప్తారు. నారదుడు లీలావతికి చేసిన ఉపదేశం ఆమె కంటే కూడా ఆమె గర్భంలో పెరుగుతున్న ప్రహ్లాడునికే ఎక్కువ ఉపయోగపడ్డాయి.
నేర్చుకోవడం అనేది గర్భస్థ సిసువుగా ఉన్నప్పుడే ప్రారంభమౌతుందని ఆధునిక శాస్త్రజ్ఞులు కూడా అనేక పరిశోధనలు చేసి నిరూపిస్తున్నారు. కడుపులో ఉన్న పిండానికి ముందుగానే వినికిడి శక్తి ఏర్పడుతుందని, దాంతో తల్లితో ఇతరులు మాట్లాడే మాటలు, తల్లి ఇతరులతో చెప్పే సంగతులు విని గ్రహించగాలుగుతారని నిపుణులు, మనస్తత్వ శాస్త్రజ్ఞులు చెప్తున్నారు.
గర్భస్థ శిశువు మన మాటలు వింటుంది, గ్రహిస్తుంది కనుక గర్భిణీ స్త్రీలను వీలైనంత ప్రశాంతంగా ఉండమని, ఆవేశాలు, అరుపులకు దూరంగా ఉండమని హెచ్చరిస్తున్నారు. ఎంత మంచి మాటలు వింటూ, ఆరోగ్యకరమైన వాతావరణంలో పెరిగితే శిశువు అంత ఆరోగ్యంగా పుట్టి పెరుగుతుంది అని సూచిస్తున్నారు.

No comments:

Post a Comment