Thursday, June 25, 2015

గురక తగ్గే మార్గం

ప్రశాంతమైన నిద్ర ఆయువును పెంచి ఆరోగ్యవంతమైన జీవితాన్నిస్తుంది. అంతటి విలువైన నిద్రకు భంగం కలిగించే గురక గురించి తెలుసుకోండి...
గురకకు కారణాలు ఒక్కొక్కరి విషయంలో ఒక్కొక్క విధంగా ఉంటాయి. ఊపిరితిత్తులలోకి గాలి తీసుకునే ముక్కు, నోరుల గాలి ద్వారాలు స్త్రీలలో కంటే మగవారిలో చాలా ఇరుకుగా ఉంటాయి. ఈ కారణం చేత ఆడవారిలో కంటే మగవారిలోనే ఎక్కువగా గురక సమస్య కనబడుతుంది. ఇరుకుగా ఉంటే నోటి ద్వారం, ముక్కుల్లో పెరిగే కొవ్వు కండలు మొదలైన సమస్యలు గురక రావడానికి వంశపార్య కారణాలుగా చెప్పవచ్చు. తరచుగా తుమ్ములు, దగ్గు, జలుబుతో బాధపడే వారిలో ముక్కు రంధ్రాలు శ్లేష్మంతో మూసుకొనిపోయి గాలి పీల్చుకోలేని స్థితిలో గురక మొదలై బాధిస్తుంది. మద్యపానం, పొగతాగడం కొన్ని రకాల మందులు తీసుకోవడం వల్ల కండరాలు బిగువు కోల్పోయి గురక ఎక్కువ అవుతుంది. చాలా మందిలో స్థూలకాయం కూడా గురకకి ప్రధానమైన కారణంగా మారి ఇబ్బంది పెడుతుంది.
గురకని గుర్తించే కొన్ని మార్గాలు
నోరు మూసుకొని గురకపెడితే మీ నాలుకలోనే సమస్య ఉందని అర్థం.
నోరు తెరచి గురకపెడితే మీ గొంతులోని మృదువైన కణజాల సమస్యగా గుర్తించాలి.
వెల్లకిలా పడుకొని గురకపెడితే ప్రధాన సమస్యగా పరిగణించాలి.
ఏ రకంగా నిద్రపోయినా గురక వస్తుంటే దాన్ని తీవ్ర సమస్యగా గుర్తించాలి.
విముక్తికి గృహ వైద్యం..
గ్లాసు నీటిలో ఒకటి లేదా రెండు పిప్పర్‌మెంటు ఆయిల్‌ చుక్కలు వేసి రాత్రి నిద్రపోయే ముందు బాగా పుక్కిలించాలి.
కొద్దిగా పిప్పర్‌మెంటు ఆయిల్‌ను చేతి వేళ్లకు రాసుకొని వాసన చూస్తుంటే గురక తగ్గిపోతుంది.
అర టీ స్పూన్‌ ఆలివ్‌ ఆయిల్‌, అర టీ స్పూన్‌ తేనె కలిపి రాత్రి నిద్రపోయే ముందు తాగితే గురక తగ్గుతుంది.
మరిగే నీటిలో 4, 5 చుక్కలు యూకలిప్టస్‌ ఆయిల్‌ వేసి తలకు ముసుగు పెట్టి రాత్రి నిద్రపోయే ముందు 10 నిమిషాల పాటు ముక్కు ద్వారా ఆవిరి పీల్చాలి.
ఆవు నెయ్యిని రోజూ కొద్దిగా వేడి చేసి కరిగించి రెండు చుక్కల చొప్పున రెండు ముక్కు రంధ్రాలలో పోసి పీల్చుతుంటే తగ్గుతుంది.
అర టీ స్పూన్‌ యాలకుల చూర్ణం ఒక గ్లాసు వేడి నీటిలో కలిపి రాత్రి నిద్రపోయే ముందు తాగి పడుకుంటే చక్కటి ఫలితం లభిస్తుంది.
2 టీ స్పూన్ల పసుపు పొడిని కప్పు వేడి పాలల్లో కలిపి రాత్రి నిద్రపోయే ముందు తాగి పడుకుంటే గురక తగ్గుతుంది.

No comments:

Post a Comment