Saturday, April 25, 2015

చీమలకు దెబ్బ తగలదేం?

ఎత్తు నుంచి వస్తువులు నేలపై పడడానికి కారణం భూమి వాటిపై ప్రయోగించే గురుత్వాకర్షణ బలమేనని ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త ఐజాక్‌ న్యూటన్‌ కనుగొన్నారు. ఆ బలం ఆ వస్తువు ద్రవ్యరాశిపై ఆధారపడి ఉంటుంది. తేలికైన వస్తువు కన్నా బరువైన వస్తువుపైనే గురుత్వాకర్షణ బలం ఎక్కువగా పనిచేస్తుంది. భూమి వస్తువును తన వైపునకు ఆకర్షించే బలానికి వ్యతిరేక దిశలో వాతావరణంలోని గాలి వల్ల ఏర్పడే నిరోధక బలం పనిచేస్తుంది. గాలి ప్రయోగించే ఈ నిరోధక బలం వస్తువు ఉపరితల వైశాల్యంపై ఆధారపడి ఉంటుంది. ఉపరితల వైశాల్యం ఎక్కువగా ఉంటే నిరోధక బలం కూడా ఎక్కువగా ఉంటుంది.
ఇక ఎత్తు నుంచి పడే చీమల లాంటి జీవుల విషయంలో వాటిపై పనిచేసే గురుత్వాకర్షణ బలం, గాలి నిరోధక శక్తి చాలా వరకు సమానంగా ఉండటం వల్ల అవి సమ వేగంతో నేలను చేరుతాయి. అందువల్ల వాటికి హాని జరగదు. ఒకవేళ ఆ సమయంలో గాలి తీవ్రంగా వీస్తే, చీమల్లాంటి కీటకాలు ఆ గాలి వాటులో కొట్టుకుపోతాయి కూడా.

No comments:

Post a Comment