Sunday, April 19, 2015

గృహాల్లో పెంపుడు జంతువులు వుండటం మంచిదేనా?

సాధారణంగా ప్రతిఒక్కరు తమతమ ఇళ్లలో ఏదో ఒక జంతువును పెంచుకుంటుంటారు. మరికొంతమంది తమ పిల్లల ఆనందం కోసం చిన్నచిన్న పిల్లులను, కుక్కలను, ఇతర జాతులకు చెందిన జంతువులను తెచ్చి బహుమానంగా ఇస్తుంటారు. గతంలో డబ్బులున్నవారే పెంపుడు జంతువులను పెట్టుకునేవారు. కానీ ప్రస్తుతకాలంలో చిన్నాపెద్ద, పేదధనిక వంటి తేడాలు లేకుండా అందరూ ఏదో ఒక జంతువును పెంచుకోవడం ఆచారంగా మారిపోయింది.

అయితే వాస్తుశాస్త్రం ప్రకారం... ఇటువంటి పెంపుడు జంతువులను పెంచుకోవడం సరైనదా, కాదా అనే కోణంలో పరిశీలిస్తే.. ఇది ఎంతో ఉత్తమమేనని పురోహితులు, జ్యోతిష్య నిపుణులు పేర్కొంటున్నారు. సహజంగా ఇంట్లో ఏవైనా ఆపదలు వచ్చినప్పుడు కూడా ముందుగా పెంపుడు జంతువులే వాటికి సంబంధించిన సమాచారాలను తమ యజమానులకు అందిస్తాయి. అలాగే గృహానికి ఎటువంటి దోషాలు, లోపాలు ఏమైనా వుంటే.. ముందుగా అవి ఇంట్లో వున్న పెంపుడు జంతువుల మీదే తమ ప్రభావాన్ని చూపుతాయి.

అంటే.. ఇంట్లో మనకు వాస్తుదోషాల నుంచి ఏవైనా ప్రమాదాలు జరిగే ముందు అవి పెంపుడు జంతువుల మీద దుష్ర్పభావాన్ని చూపుతాయి. ఆ తరువాత గృహంలో వున్నవారికి మెల్లమెల్లగా సోకడం జరుగుతుంది. దీనిని బట్టి మనం జరిగే నష్టాలను, లోపాలను పెంపుడు జంతువుల ద్వారా ముందుగానే పసిగట్టి, వాటి నివారణకు చర్యలు తీసుకోవచ్చు.

ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. పెంపుడు జంతువులకు కూడా ఒక నిర్దిష్టమైన స్థలాన్ని కేటాయించుకోవాలి. వాటి కోసం ఏదైనా ఒక షెడ్డు నిర్మించుకోవాలంటే.. దానిని వాస్తుశాస్త్ర ప్రకారం దక్షిణ మధ్యస్థ భాగంలోకానీ, పడమర మధ్యస్థ భాగంలోకానీ, నైరుతి లేదా వాయువ్యంవైపుగా వున్న దిశలలో నిర్మించుకోవడం చాలా మంచిదని నిపుణులు తెలుపుతున్నారు.

గృహ వాస్తు దోషాల నుంచి విముక్తి కలగాలంటే... అద్దె ఇంట్లో వున్నవారుగానీ, సొంతంగా ఇంటిని నిర్మించుకోలేనివారుగానీ వాస్తుశాస్త్రాలను అనుసరించి నిర్మించిన దేవాలయాలను ప్రతిరోజూ సందర్శించి కొంత సమయం అక్కడే వేచి వుండాలి. ఆ తరువాత తమ పనులను ప్రారంభిస్తే అన్ని విధాలుగా మంచి ఫలితాలు కలుగుతాయని వాస్తుశాస్త్ర నిపుణులు బల్లగుద్దిమరీ చెబుతున్నారు.

No comments:

Post a Comment