Tuesday, August 14, 2012

బట్టలకు సంబంధించిన చిట్కాలు


  • ఇష్టపడి కొనుక్కున్న జీన్స్ రంగుమారకుండా ఉండాలంటే, అరబక్కెట్ నీటిలో నాలుగు టేబుల్ స్పూన్ల వెనిగర్ వేయాలి. ఈ నీటిలో దుస్తుల్ని కొద్ది సేపు నానబెట్టి ఆ తర్వాత ఉతకాలి.
  • ఊలు, సిల్కు బట్టలు గోరువెచ్చటి నీటిలో పిండిన తరువాత ఒక కాటన్ టవల్లో ఉంచి రోల్ చేస్తే టవల్ వాటి తడిని పీల్చుకుంటుంది. తర్వాత ఆరేయాలి.
  • ఐరన్ బాక్స్ అడుగున కొద్దిగా పారాఫిన్ రాస్తే గంజిపెట్టిన బట్టలు అతుక్కోకుండా ఉంటాయి.
  • ఒక టేబుల్ స్పూను నిమ్మ చెక్కల పొడిని వాషింగ్ పౌడర్ లో కలిపి బట్టలు ఉతికితే బట్టలు తెల్లగా ఉంటాయి.
  • క్లాత్ పై గమ్ అతుక్కుంటే కొద్ది సేపు ఐసుముక్కను క్లాత్ పై ఉన్న గమ్ పై ఉంచి ఆ తర్వాత గీరేస్తే గమ్ ఊడిపోతుంది.
  • కొత్త బట్టలు, సిల్కు బట్టలు ఉతికేటప్పుడు ఆ నీటిలో కొంచెం ఉప్పు కలిపితే వాటి మృదుత్వం, రంగు పోకుండా కాపాడుకోవచ్చు.
  • గోడకు కొట్టిన మేకుకి బట్టలు తగిలించి తీసేటప్పుడు హడావిడిగా లాగితే చిరిగే ప్రమాదం ఉంది. ఆ మేకులో రబ్బరు కాని, స్పాంజ్ కాని గుచ్చి ఉంచితే బట్టలు చిరగవు.
  • చేతి గుడ్డలకు, రిబ్బన్లకు పట్టిన మురికి పోవాలంటే ఉప్పు కలిపిన నీటిలో ఉతికితే చాలు.
  • చేతితో ఎంబ్రాయిడరీ చేసేటప్పుడూ దారపు ఉండని చిన్నకప్పులో వేసి కుట్టుకుంటే దారం ఎక్కడికో వెళ్ళటం, వెతుక్కోవటం ఉండదు.
  • జడల చమురు జాకెట్ల వెనుక అంటుతుంది. సోపుతో ఉతికితే గుడ్డ కాంతి పోతుంది. కనుక పత్తిలో కాని గుడ్డ ముక్కలో కాని పెట్రోలు అద్ది చమురున్న భాగాన రాస్తే కొత్త జాకెట్లా తయారు అవుతుంది.

  • తుప్పుపట్టిన తీగలపై బట్టలు ఆరేసినప్పుడు లేదా బట్టలకు ఉన్న హుక్స్ తుప్పు పడితే, బట్టలకు తుప్పు మరకలు అవుతాయి. ఆ తుప్పు మరకలు పోవాలంటే మరకల మీద నిమ్మ తొక్కలతో గానీ ఉప్పు కలిపిన నిమ్మరసంతో గానీ రుద్ది ఎండలో వేయాలి.
  • తెల్లటి నూలు వస్త్రాలపై తుప్పుమరకలు పడితే వాటిమీద నిమ్మరసం, ఉప్పు రాసి రెండు గంటలు ఎండలో ఉంచి ఆ తర్వాత ఉతకాలి.
  • తెల్లని బట్టమీద కూర మరకలు పడితే ఆ మరక మీద తెల్లని టూత్ పేస్టు కొంచెం రాసి నీటిలోఉంచి తడిపి ఉతికి ఆరేస్తే మరక పోతుంది.
  • తెల్లని బట్టలపైన పడిన మరకలను నిమ్మరసం వేసి నిమ్మ తొక్కతో రుద్ది తర్వాత సబ్బుతో ఉతికితే మచ్చలు మాయమవుతాయి.
  • దుప్పటి చివర్లు చినుగుతున్నట్లయితే కొత్త శాటిన్ బట్టను కొని దుప్పటి నాలుగు అంచులకు బోర్డర్‌లా వేసి కుడితే అది మళ్ళీ కొత్తదానిలా తయారవుతుంది.
  • నారింజ తొక్కలు ఎండ పెట్టి బట్టల మధ్య ఉంచితే బట్టల్ని పురుగులు కొట్టి వేయవు.
  • నిమ్మతొక్కలతో రుద్దితే బట్టలమీద పడిన గోరింటాకు మరకలు పోతాయి.
  • పసుపు మరకలైన గుడ్డలకు సబ్బు రాస్తే ఎరుపు అవుతుంది. కనుక ఉతకటానికి ముందు ఎండలో ఆరవేస్తే పసుపు మరకలు పోతాయి.
  • పేరుకున్న మురికిని వదిలించడానికి గట్టిగా బ్రష్‌తో రుద్దితే షర్టుకాలర్లు త్వరగా పాడవుతాయి. కాస్త షాంపువేసి నాననిచ్చి ఉతికి చూడండి మంచిగా వుంటాయి.
  • బట్ట మీద ఇస్త్రీ పెట్టి చిలుం మరక అయినట్లయితే ఆ మరకను ఉప్పు పొడిలో రుద్ది, కొంత సేపు తరువాత ఉతికినట్లయితే చిలుం మరకపోతుంది.

  • బట్టలకు రక్తం, సిరా మొదలైన మరకలు అయినట్లయితే ఉప్పు కలిపిన నీటిలో ఉతికి వేడి నీటిలో జాడిస్తే మరకలు సులభంగా పోతాయి.
  • బట్టలపై సిరా మరకలు పోవాలంటే నిమ్మరసం కాని, పుల్లని పెరుగుకానీ ఆ మరకపై వేసి రుద్దండి. ఆ పైన ఉప్పుతో సిరా మరక పోయేంత వరకు రుద్ది ఉతికేయాలి.
  • బట్టలు నానబెట్టే ముందు ఆ నీళ్ళలో కాస్త వెనిగర్ ని కలిపితే బట్టలు రంగులు వెలిసి పోకుండా మెరుస్తూ ఉంటాయి.
  • బట్టల్లో బొద్దింకలు చేరకుండా ఉండేందుకు కలరా ఉండలతో పాటు కర్పూరాన్ని కూడా ఉంచవచ్చు.
  • మగవారి కోటు, ప్యాంటు గుండీలు సన్నటి నైలాన్ దారంతో కుడితే చాలా కాలం తెగకుండా ఉంటాయి.
  • మీ పిల్లల వైట్ సాక్స్ బ్రౌన్ గా తయారయ్యాయా? నీటిలో రెండు లెమన్ స్లయిసెస్ వేసి ఆ నీటిలో ఈ సాక్సును వేసి నీటిలో బాయిల్ చేసి ఆ పైన ఉతకండి చాలు సాక్స్ తెల్లగా మెరిసిపోతాయి.
  • లెదర్ సోఫా పైన పిల్లలు క్రేయాన్స్ తో గీస్తే, వంటసోడా ఉప్పు కాస్త నీరు కలిపి పేస్టులా చేసి ఈ పేస్టుతో రుద్దితే మరక తొలగిపోతుంది.
  • సిల్క్ బట్టలు నీడలోనే ఆరవేయాలి.

మరకలకు చెక్!
  • సిల్క్ చీరలకి, డ్రస్సులకు అంటిన గ్రీజు, నూనె మరకలు వదిలించడానికి వాటిని ఒక బకెట్ నీళ్ళలో కొన్ని చుక్కలు షాంపూ వేసి నానబెట్టండి. కాసేపటి తరువాత ఉతికితే మరకలు మాయమవుతాయి.
  • బట్టలకు తారు అంటితే, తారు తొలగించి, తరువాత మరక ఉన్న చోట యూకలిప్టస్ నూనెతో రుద్దితే మరక పోతుంది.
  • బట్టలకు అంటిన చూయింగ్ గమ్‌ను గంజిపొడితో రుద్ది తొలగించవచ్చు. లేదా గమ్‌ ఉన్న చోట పైన పేపర్‌వేసి వేడిగా ఉన్న ఇస్త్రీపెట్టెను పైనపెడితే పేపర్‌కు అంటుకొని గమ్‌ వదిలిపోతుంది.
  • నూనె మరకలు పడితే కొంచెం పెట్రోలుతో రుద్ది పోగొట్టవచ్చు.
  • ఉన్ని బట్టల మీద కూర మరకలైతే ఒక టవల్ అంచుని పెర్‌ఫ్యూమ్‌లో గాని, కిరోసిన్‌లో గాని ముంచి ఆ మరక పోయే వరకు రుద్దాలి. మరకలు పోవటంతో పాటు బట్టలు సువాసనను సంతరించుకుంటాయి.
  • బట్టలమీద తుప్పు మరకలైతే, వాటిపై నిమ్మరసం పట్టించి ఆవిరిమీద పెట్టాలి. తుప్పు మరకలు మాయం.
  • డ్రస్సులకు ఉన్న లేస్‌లు మురికి పట్టి అసహ్యంగా ఉంటే సబ్బు కలిపిన నీటిలో కొంచెంసేపు నానబెట్టి తరువాత మృదువుగా ఉతకాలి.
  • ఎప్పుడైనా బట్టల మీద ఇండియన్ ఇంక్ గానీ, పెయింట్స్ గానీ పడ్డాయంటే వెంటనే నీళ్ళలో కొద్దిగా కిరసనాయిలు వేసి ఆ బట్టలను ఒక రోజు పూర్తిగా నానబెట్టి ఉతకండి. ఆ పడిన వాటితో సహా, ఆ బట్టలుకు ఉన్న కుళ్ళు కూడా వదలిపోయి క్రొత్త బట్టల్లా శుభ్రపడతాయి.
పట్టు చీరలు ఉతికేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు
  • పట్టుచీరలను మృదుజలంతో ఉతకాలి. కఠిన జలమైతే నీటిని మృదువు చేయడానికి చిటికెడు బోరాక్స్ లేదా అమోనియంను వాడాలి.
  • నాణ్యమైన తటస్థ సబ్బులు పొడి రూపంలోకాని ద్రవరూపంలో కాని ఉపయోగించాలి. కఠిన జలమైతే లైట్ డిటర్జెంట్లను వినియోగించాలి.
  • సబ్బులోని మట్టిని తొలగించడానికి పట్టు వస్త్రాలను వేడి నీటిలో రెండు మూడు సార్లు జాడించాలి. చివరగా చల్లని నీటితో జాడించేటప్పుడు కొన్ని చుక్కల సిట్రిక్ యాసిడ్ లేదా ఎసిటిక్ యాసిడ్‌ను ఉపయోగించాలి.
  • అనుమానపు రంగు కల పట్టు వస్త్రాలు ఉతికే ముందు 1 నుంచి 2 నిముషాలు చిటికెడు సిట్రిక్ యాసిడ్ లేదా ఎసిటిక్ యాసిడ్ కలిపిన చల్లని నీటితో తడపాలి.
  • పట్టు వస్త్రాలు ఉతికిన తరువాత చేతితో సున్నితంగా పిండి తడిని తీయాలి. పట్టు చీరలను గదిలో నీడ పట్టున వేలాడ దీసి ఆరబెట్టాలి.
పట్టు వస్త్రాలపై మరకలు తీసే పద్దతులు
  • రక్తం : వేడి నీటిలో జాడించి, కొన్ని చుక్కల అమోనియాను 10 సి.సి.ల హైడ్రోజన్ పెరాక్సైడ్‌తో కలిపి మరకల మీద పూసి ఉతకాలి.
  • పెరుగు, వెన్న : ఒక చుక్క కార్బన్ టెట్రాక్లోరైడ్‌ని ఉపయోగించాలి.
  • చాక్‌లేట్ : వేడి నీటిలో జాడించి ఉతకాలి.
  • కాఫీ లేదా టీ : వస్త్రాలను ఆరనివ్వాలి. కార్బన్ టెట్రాక్లోరైడ్ ను పూసి మరకపోనట్లయితే కొద్దిగా హైడ్రోజన్ పెరాక్సైడ్‌ను కలిపిన వేడి నీటిలో ఉతకాలి.
  • కాస్మెటిక్ : బార్ సబ్బుతో రుద్ది జాడించి ఉతకాలి.
  • ఇంక్ లేదా లిప్‌స్టిక్ : మరకైన చోట పేపర్ టవల్‌ను ఉంచి వెనుక భాగాన డ్రైక్లీనింగ్ ద్రావణం లేదా ఆల్కహాల్‌ను పూయాలి. మరక తొలిగే వరకు నీటిని ఉపయోగించరాదు.
  • గోళ్ళరంగు : అసిటోన్‌ను వాడాలి.
  • క్రీం ( ఐస్ - పాలు ) : కార్బన్ టెట్రా క్లోరైడ్ పూసి వేడినీటిలో ఉతకాలి.
  • గుడ్డు : చల్లని నీటితో తుడవాలి.
  • పళ్ళరసాలు : ఆల్కలీ, ఆల్కహాలును సమభాగాల్లో తీసుకొని తుడుచి ఉతకాలి.
  • గ్రీజు మరకలు : టాల్కం పౌడరును మరక మీద వేసి దాన్ని మరక కిందిభాగాన అంటేలా పేపరు టవలు మీద ఉంచి డ్రైక్లీనింగ్ ద్రావణంతో తుడవాలి. జాడించి ఉతికి ఇస్త్రీ చేయాలి.
  • యంత్రం నూనె : మరకలను పీల్చేగుణమున్న పేపరుతో కప్పి రుద్దాలి. కార్బన్ టెట్రాక్లోరైడ్‌ను ఉపయోగించి మరకలను తొలగించాలి.
  • మట్టి : వస్త్రాలను ఆరనిచ్చి కార్బన్ టెట్రాక్లోరైడ్ తో తుడిచి ఉతకాలి.
  • రంగులు : వేడినీటితో జాడించి ఉతకాలి. మరక పోవాలంటే టర్పెంటైన్, కిరోసిన్ తో తుడిచి జాడించి ఉతకాలి.
  • వార్నిష్ నూనె : కార్బన్ టెట్రాక్లోరైడ్ తో తుడవాలి.
  • చెమట : తక్కువ ఘాడత కల హైడ్రాక్లోరిక్ ఆమ్లంలో జాడించి ఉతకాలి.
  • బూట్ పాలిష్ : ఎక్కువ గల పాలిష్‌ను తొలగించాలి. ద్రావణ డిటర్జెంట్ తో రుద్ది తర్వాత ఆల్కహాల్ పూయాలి.
  • వైన్ లేదా శీతల పానీయాలు : చల్లని నీటిలో జాడించి ద్రావణ డిటర్జెంట్ ను ఉపయోగించి వేడినీటితో ఉతకాలి.
పట్టు వస్త్రాలను భద్రపరిచేందుకు చిట్కాలు
  • మడతలు పడకుండా పరిశుభ్రంగా భద్రపరచాలి.
  • పురుగులు, దుమ్ము, ధూళి సోకకుండా, ఎక్కువ గాలి, కాంతి తగలకుండా కాపాడాలి.
  • కలప మీద పట్టు వస్త్రాలను నేరుగా తాకేల భద్రపరచరాదు.
  • ప్లాస్టిక్ సంచులు ఉపయోగించరాదు. కాటన్ సంచులను మాత్రమే ఉపయోగించాలి.
  • అప్పుడప్పుడు బయటకు తీసి గాలి సోకనీయాలి.
  • పట్టు చీరలను భద్రపరిచే ప్రదేశంలో సిలికాన్‌జెల్ సంచులను ఉపయోగించాలి.
ఆభరణాల శుభ్రతకు సంబంధించినవి
  • అగరుబత్తీలు బూడిదని ఉపయోగించి వెండి ఆభరణాలను శుభ్రం చేస్తే అవి తళతళ లాడతాయి.
  • ఆలివ్ ఆయిల్ లో ముంచిన దూదితో ముత్యాల నగలు తుడిస్తే ముత్యాలు బాగా మెరుస్తాయి.
  • బంగారు గొలుసులు చిక్కు పడినట్లయితే దానిమీద పౌడరు చల్లి చిక్కులను తేలికగా విడగొట్టవచ్చు.
  • బంగారు నగలు పాతబడినట్లుగా ఉంటే పాత టూత్ బ్రష్, సబ్బునీళ్ళు ఉపయోగించి మళ్ళీ తళతళలాడేటట్లుగా చేయవచ్చు.
  • మీరు ముత్యాల ఆభరణాలు తరచూ ధరిస్తారా! అయితే వాటిని తొలగించిన వెంటనే మెత్తని వస్త్రంతో తుడవడం మర్చిపోకండి. ఇలా చేస్తే ఆభరణాలకు చెమట, మేకప్ లో వాడే రసాయనాలు అంటినా ముత్యాలు రంగుమారవు.
  • ముత్యాల నగలు మెరుపు (షైనింగ్) పోకుండా ఉండాలంటే ఎరుపు పట్టు గుడ్డలో ఉంచితే చాలు.
  • ముత్యాలదండను తరచూ వాడుతుంటే ముత్యాలు రంగు మారవు. కారణం చర్మం దానికి కావలసిన తేమ, నూనెను అందిస్తుంది.
  • వెండి ఆభరణాలు మురికి పట్టినట్లయితే ఉప్పు కలిపిన నీటిలో ఉడక బెట్టి తరువాత చన్నీళ్ళలో కడిగితే శుభ్రంగా ఉంటాయి.

No comments:

Post a Comment