Tuesday, August 14, 2012

ఫ్రిజ్‌తో సమస్యా? చిట్కాలివిగో


వేసవి వచ్చిందంటే ఫ్రిజ్‌ల హడావుడి మొదలైనట్లే. చల్లటి నీళ్లు కావాలని ఒకరు. శీతల పానీయాల కోసం ఇంకొకరు, ఆదేశాలు జారీ చేస్తుంటారు. మండే ఎండాకాలంలో ఫ్రీజ్‌తో ఎలాంటి సమస్యలు వద్దంటే నిర్వహణలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అప్పుడే బాదరబందీలుండవు. మెకానిక్‌ల చుట్టూ ప్రదక్షిణాలు చేసే అవసరమూ రాదు.
  1. ఫ్రిజ్‌‌కు స్టెబిలైజర్ తప్పనిసరి. ఇది లేకపోతే వోల్టేజీల్లో తేడా వస్తే ఫ్రిజ్ పనికి రాకుండా పోతుంది. మరమ్మతులకు సుమారు రూ. 3,000 వరకు ఖర్చుతప్పదు.
  2. కంప్రెసర్ ఫ్రిజ్ కు గుండె వంటింది. ఫ్రిజ్ పనితీరు దీని మీదే ఆధారపడుతుంది. కంప్రెసర్‌లో సమస్యలున్నాయా లేవా అన్నది చూసుకోటం ముఖ్యం.
  3. ఫ్రిజ్ వెనక ఉండే కాయిల్స్ వేడిని తగ్గిస్తాయి. దీనిపై చెత్తాచెదారం, బూజు పడితే కాయిల్స్ సరిగ్గా పని చేయవు. దీంతో కంప్రెసర్ మీద భారం పడుతుంది. ఫలితంగా ఫ్రిజ్ పనితీరు మందగిస్తుంది.
  4. వేసవి మొదలుకాగానే ఫ్రిజ్‌ను శుభ్రపర్చాలి. ఇందుకు కోలిన్ లిక్విడ్ వాడాలి. ఫ్రిజ్ తలుపుకుండే గ్యాస్‌కిట్‌ను బయటికి తీసి శుభ్రం చేయాలి. లేకపోతే క్రిమికీటకాలు చేరే అవకాశముంది. గ్యాస్‌కిట్‌ను రెండు మూడు వారాలకోసారైనా తుడవాలి. కాయిల్స్‌ను శుభ్రం చేయటం మర్చిపోవద్దు.
  5. వేసవి అన్నాక విద్యుత్ కోత ఉండడం మామూలే కదా! రెండు గంటలు దాటినా కరెంటు రాకపోతే ఫ్రిజ్ తలుపులు తెరిచి పెట్టాలి. లేకుంటే లోపల ఉన్న పదార్ధాలు పాడయ్యే అవకాశముంది.
  6. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వారు తరుచుగా ఫ్రిజ్ తలుపు తెరుస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఫ్రిజ్ తలుపు సరిగ్గా వేయకపోతే చల్లదనమంతా బయటికి వెళ్లిపోతుంది. ఫలితంగా కంప్రెసర్ మీద భారం పడి విద్యుత్ బిల్లు బెంబేలెత్తిస్తుంది.
  7. ఎండ పడే చోట లేదా వేడి అధికంగా ఉన్న ప్రాంతంలో ఫ్రిజ్ పెట్టకూడదు. హీటర్లు, స్టవ్‌లను ఫ్రిజ్‌కు దూరంగా పెట్టడం మంచిది. ఫ్రిజ్‌కు స్వచ్చమైన గాలి తగలాలి. లేకపోతే చల్లదనం కాస్త వేడిగా మారుతుంది. మరో విషయం. ఫ్రిజ్ పనిచేస్తున్నప్పుడు అటూ ఇటూ కదపడం చేయకూడదు.
  8. విద్యుత్ ఆదా కోసమని రాత్రివేళలో ఫ్రిజ్‌ను స్విచ్చాఫ్ చేయకూడదు. విద్యుత్ బిల్లులు మరీ భారీగా వస్తుంటే రెండు రోజులకోసారి గంటన్నర సేపు స్విచ్చాఫ్ చేయవచ్చు. లేదా డీఫ్రాస్ట్ చేసినా ఫర్వాలేదు. అదీ రాత్రి పది తర్వాతే.
  9. ఫ్రిజ్‌లు రాత్రివేళలో శబ్ధాలు చేస్తుంటే డీలర్‌ను సంప్రదించి మరమ్మతు చేసివ్వాల్సిందిగా కోరండి. ఏప్రిల్ వచ్చిందంటే ఫ్రిజ్ మెకానిక్‌లు యమా బిజీగా ఉంటారు. అలాంటప్పుడు వారికివ్వటం వరకే మీ చేతిలో ఉంటుంది. ఇంటికెప్పుడు చేరుతుందో చెప్పటం కష్టమే.
  10. మీరు వేసవిలో టూర్లకు వెళ్లినా ఫ్రిజ్ పని చేస్తూనే ఉండాలి. నెలలతరబడి ఇంటికి రాకపోతే తప్ప స్విచ్చాఫ్ చేయకూడదు. ఒకవేళ చేయాల్సి వచ్చినా అందులో ఎలాంటి వస్తువులు నిల్వ ఉంచకూడదు. సెలవులకు వెళ్లి వచ్చాక అరగంట తెరిచి ఉంచితే దుర్వాసన బయటికి వెళ్లిపోతుంది. కొత్తగా ఫ్రిజ్ కొన్నపుడు కూడా.. ఇరవై నిమిషాలు సేపు ఫ్రిజ్ తలుపు తెరిచి ఉంచాలి.

No comments:

Post a Comment