Wednesday, November 12, 2014

ఆవుపాల పెరుగు ప్రాముఖ్యత

ఆవుపాల పెరుగు ఆకలి కలిగిస్తుంది. జీర్ణశక్తిని పెంచి శక్తినిస్తుంది. పెరుగు లేదా దధి ఒక మంచి ఆహార పదార్ధము. మరిగించిన పాల లో గోరువెచ్చగా ఉండగా మజ్జిగచుక్కలను వేస్తే పాలు గట్టిగా తోడుకొంటాయి. దీనినే పెరుగు అంటారు. పెరుగు నుండి వెన్న,నెయ్యి లను తీస్తారు. పాలలో తోడు తక్కువ వేస్తే పెరుగు తియ్యగా ఉంటుంది. తోడు ఎక్కువైతే పెరుగు పుల్లగా ఉంటుంది. పెరుగు ఎలాంటి వాత వ్యాధినయినా జయిస్తుంది. ఇది బరువును పెంచుతుంది, శరీరానికి పుష్టిని కలిగిస్తుంది. ఆహారం మీద యిష్టం లేని వాళ్ళకి పెరుగు మంచిదని ఆయుర్వేదం చెబుతుంది.

మనం తెలుగులో దీనిని "పెరుగు" అంటాం. ఆంగ్లంలో "యోగర్ట్" అనీ హిందీలో "దహీ" అని అంటారు. ఏదైనా ఫెర్మెంటో పాలనే పెరుగు అనడం అర్థవంతంగా లేకపొయినా, పాలని పులవబెట్టడం వలన పెరుగవుతోందనేది అందరికీ తెలిసిందే. ఆరోగ్యాన్నివ్వటంలో పెరుగుని మించిన పదార్థం మరొకటి లేదు. ఆహార పదార్థాలలో దీనిని అమృతంగా పోలుస్తారు. విదేశాల్లో అయితే ఆవు పాలతోనే పెరుగు తయారుచేస్తారు. మన దేశంలో మాత్రం గేదె పాలతోనూ పెరుగు తయారుచెయ్యటం పరిపాటి.


పెరుగులో పోషకపదార్థాలు:
పోషక పదార్థం
విలువలు
నీటిశాతం89.1%
ప్రోటీన్3.1%
క్రొవ్వులు4%
మినరల్స్0.8%
కార్బొహైడ్రేట్స్3%
కాల్షియం149 మి.గ్రా
ఫాస్పరస్93 మి.గ్రా
ఇనుము0.2 మి.గ్రా
విటమిన్ - ఎ102 ఐ.యు
విటమిన్ - సి1 మి.గ్రా
* జలుబుగా ఉన్నపుడు పెరుగు బాగా పనిచేస్తుంది.

* మూత్ర సంబంధమైన రోగాల్లో కూడా పెరుగు ఉత్తమం.

* జిగురు విరేచనాలయ్యేవారికి పెరుగు బాగా పని చేస్తుంది.

* మీగడ తీసిన పెరుగు, పాలపై వెన్న తీసి తయారుచేసిన పెరుగు అత్యుత్తమమైన ఫలితాలనిస్తాయి.

* పెరుగులో పెసరపప్పు, శొంఠి, పంచదార , ఉసిరి కాయ పొడి చేర్చి తింటే అధికమైన ఉపయోగాలు పొందవచ్చునని ఆయుర్వేదం చెబుతుంది.

*అన్ని రకాల జ్వరాల్లో కూడా పెరుగును నిరభ్యంతరంగా వాడుకోవాలని ఆయుర్వేద సూచన.

* పెరుగులో తియ్యనిది, పుల్లనిది, బాగా పుల్లనిది అని మూడు రకాలు ఉంటాయని సుశృతుడు వివరించాడు. అలాగే పెరుగు వాడటం వలన శరీరానికి చాలా ఉపయోగం అని చరకుడు కూడా తెలిపాడు.

* పెరుగులో ఉండే పోషక విలువలు పాలలో ఉండే పోషక విలువలతో సమానంగా ఉన్నప్పటికీ, పెరుగులో ఉండే ప్రత్యేక గుణం దాన్ని ఆరోగ్యాన్నిచ్చే పదార్థాలలో ఉన్నత స్థానంలో ఉంచుతుంది. పాలు పెరుగుగా మారడానికి జరిగే ప్రక్రియలో బాక్టీరియా పాలలో ఉండే ప్రోటీన్ ని తేలికగా అరిగేలా చేస్తుంది. ఈ రకమైన మార్పు వలన పెరుగు త్వరగా జీర్ణం అవుతుంది.

* జీర్ణకోశంలో పెరిగే హానికర బాక్టీరియాలని పెరగనివ్వకుండా చేస్తుంది. అంతే కాకుండా మనకి "మంచి" చేసే బాక్టీరియాని పెరిగేలా కూడా చేస్తుంది. ఈ బాక్టీరియా పెరుగులో ఉండే మినరల్స్ త్వరగా రక్తంలో కలిసేలా చెయ్యడం , బి కాంప్లెక్స్ విటమిన్ ని తయారుచేయటం లాంటి పనులు కూడా చేస్తుంది.

* చర్మం నిగనిగలాడుతూ కనిపించేలా కూడా పెరుగు ఉపయోగపడుతుంది.

* ఎండ వేడికి చర్మం పాడవకుండా చేస్తుంది. చర్మానికి సరఫరా అయ్యే నరాలకి శక్తినిస్తుంది. పెరుగులో ఉండే బాక్టీరియా చర్మ పోషణకు ఉపయోగపడుతుంది.

* పెరుగులో నిమ్మరసాన్ని కలిపి ముఖానికి పై పూతగా పూస్తే చర్మం పై ఉండే మలినాలు త్వరగా కరిగిపోతాయి. చర్మంపై తేమ శాతం పెరుగుతుంది. కాంతివంతంగా తయారవుతుంది.

* ముఖంపై మొటిమలున్నవారికి పెరుగులో కొంచెం శనగ పిండి కలిపి ముఖానికి రాస్తే మొటిమలు తగ్గిపోతాయి.

* పెరుగు తలకి రాస్తే మంచి కండిషనర్ గా కూడా పనిచేస్తుంది. తలస్నానానికి ముందుగా పెరుగుని తలకి మర్థించి తర్వాత స్నానం చేస్తే సరిపోతుంది.

* చుండ్రు సమస్యతో సతమతమయ్యేవారు పెరుగులో కొంచెం ఉసిరికాయ పొడినికలిపి తలకి పట్టించి అరగంట తర్వాత స్నానం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి.

** అలాగే ఆయుర్వేదం పెరుగును గురించి చెబుతూ రాత్రి వేళల్లో పెరుగు వేసుకోకూడదంటుంది. అలాగే పెరుగుని వేడి చేసి తినకూడదు.పూర్తిగా తోడుకోని పెరుగును కూడా తినవద్దని ఆయుర్వేదంలో ఉంది.  వేసవికాలం పెరుగును ఎక్కువ తీసుకోరాదు. అలాగే ప్రతిరోజూ తినకూడదు. 

No comments:

Post a Comment