Thursday, May 10, 2012

మీగడతో పెసరపప్పు కూర


కావలసిన పదార్థాలు


  • పొట్టుతీయని పెసరపప్పు. 1/4 కేజీ
  • మీగడ. 1/4 కప్పు
  • నూనె. 2 టీస్పూ//.
  • పచ్చిమిర్చి. 10
  • అల్లం. చిన్నముక్క
  • ఉల్లిపాయలు. మూడు
  • ఉప్పు. తగినంత
  • టొమోటో గుజ్జు. 1.1/2 కప్పు
  • నెయ్యి. 1 టీస్పూ//.
  • పుదీనా. కొద్దిగా
  • ఉల్లితరుగు. 1/4 కప్పు

తయారు చేయు విధానము:


బాణెలిలో నూనె వేసి, పెసరపప్పు దోరగా వేయించి తీయాలి. వేయించిన పప్పుని బాగా నీళ్లతో కడిగి తగినన్ని నీళ్లు, పసుపు వేసి ఉడికించాలి.
పప్పు ఉడికిన తరవాత పచ్చిమిర్చి, అల్లం, ఉల్లిపాయముక్కలు వేసి ఉడికించాలి. పప్పుని బాగా మెదపాలి.
తరవాత ఉప్పు, టొమాటో గుజ్జు వేసి, కలిపి సిమ్‌లో పెట్టి ఉడికించాలి. చివరగా మీగడ కూడా కలిపి మరో మూడు నిమిషాలు సిమ్‌లో ఉంచి దించేయాలి.
మరో బాణెలిలో నెయ్యి వేసి ఉల్లిపాయముక్కలు పుదీనా ఆకులు వేసి వేయించి పప్పులో కలపాలి. అంతే వేడి వేడి మీగడతో పెసరపప్పు కూర రెఢీ.

మెంతి ఆకులతో పనీర్ కర్రీ


కావలసిన పదార్థాలు


  • పనీర్. 1/2కేజీ
  • మెంతి ఆకులు. 3 కప్పులు
  • మిరియాల పొడి. 1 టీస్పూ//.
  • శెనగపిండి. 1.1/2 కప్పు
  • నూనె. తగినంత
  • జీలకర్ర. 2 టీస్పూ//.
  • టొమోటో గుజ్జు. 1 కప్పు
  • నీరు. తగినన్ని
  • తాజా మీగడ. 2 టీస్పూ//.
  • ఉప్పు. సరిపడా

తయారు చేయు విధానము:


సెనగపిండిలో ఉప్పు కలపాలి. పనీర్‌ను పెద్దపెద్ద ముక్కలుగా కోసి సెనగపిండిలో దొర్లించాలి.
వెడల్పాటి బాణెలిలో కొద్దిగా నూనె వేసి పనీర్‌ ముక్కల్ని బంగారువర్ణంలోకి వచ్చేవరకూ వేయించి పక్కన ఉంచాలి.
అదే బాణలిలో మిగిలి ఉన్న నూనెలోనే టొమాటో గుజ్జు, మిరియాల పొడి, ఉప్పు, వేయించిన జీలకర్ర పొడి, మెంతి ఆకులు, నీళ్లు పోసి 30 నిమిషాలపాటు తక్కువ మంటమీద ఉడికించాలి.
తరవాత పనీర్‌ ముక్కలు వేసి కాస్త గ్రేవీ ఉండగానే దించి మీగడ వేసి కలపాలి. అంతే మెంతి ఆకులతో పనీర్ కర్రీ రెఢీ.

పాలకూర కర్రీ


కావలసిన పదార్థాలు


  • పాలకూర. 4 కట్టలు
  • మెంతికూర. 2 కట్టలు
  • ఆవకూర. 1/2 కప్పు
  • పచ్చిమిర్చి. 8
  • నూనె. 4 టీస్పూ//.
  • వెల్లుల్లి. 8 రెబ్బలు
  • అల్లం. చిన్నముక్క
  • జీలకర్ర. 2 టీస్పూ//.
  • ఇంగువ. చిటికెడు
  • ధనియాలపొడి. 1 టీస్పూ//.
  • పసుపు. 1/4 టీస్పూ//
  • బియ్యప్పిండి. 2 టీస్పూ//.
  • పెరుగు. 4 టీస్పూ//.
  • మంచినీళ్లు. 4 కప్పులు
  • ఉప్పు. తగినంత

తయారు చేయు విధానము :


పాలకూర, మెంతికూర, ఆవకూర. అన్నీ శుభ్రంగా కడగాలి. ప్రెషర్‌ పాన్‌లో ఆకులన్నీ వేసి, పచ్చిమిర్చి చిలికలు వేసి బాగా ఉడికించాలి.
కాస్త పులుపు కావాలనుకుంటే 2 టొమాటోలు వేసుకోవచ్చు.
మరో బాణెలిలో నూనె వేసి కాగాక అల్లంవెల్లుల్లి ముద్ద వేసి ఎర్రగా వేగాక జీలకర్ర, ఇంగువ, మెంతులు, పసుపు వేసి తాలింపు పెట్టి ఉడికించిన ఆకుకూర కూడా అందులో కలపాలి. తరువాత ధనియాలపొడి, ఉప్పు వేయాలి.
బియ్యప్పిండిలో కొద్దిగా నీళ్లు పోసి జారుగా కలిపి కూరలో కలపాలి.
అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసి, పెరుగువేసి మూతపెట్టి పది నిమిషాలుఉడికించి దించాలి. దించేముందు కొద్దిగా నెయ్యి వేయాలి. అంతే వేడివేడి పాలక్ గ్రీన్‌ కర్రీ రెఢీ.

సోయాబీన్స్ కర్రీ


కావలసిన పదార్థాలు


  • సోయాబీన్స్. 1/4 కేజీ
  • రీఫైండ్ ఆయిల్. వేయించేందుకు సరిపడా
  • కరివేపాకు. 1/2 కట్ట
  • కారం. 1/2 టీస్పూ//.
  • ఉప్పు. సరిపడా
  • జీలకర్ర పొడి. 1 టీస్పూ//.

తయారీ విధానం


సోయాబీన్స్‌ను కడిగి ఆరుగంటలసేపు నానబెట్టి నీరు వడగట్టి బాగా ఆరనివ్వాలి.
తరవాత బాణెలిలో నూనె పోసి కాచి గింజల్ని కరకరలాడేలా వేయించాలి.
వేడిగా ఉండగానే ఉప్పు, కారం, జీలకర్ర పొడి చల్లాలి. కొద్దిగా నలిపిన కరివేపాకును వేసి ఓసారి అట్లకాడతో గింజల్ని కలియతిప్పి ఆరాక డబ్బాలో పోసి పెట్టాలి.
చాలారోజులపాటు నిల్వ ఉండే సోయాబీన్స్ దాల్‌ ఫ్రై రెఢీ.

క్యాప్సికం టొమోటో కూర


కావలసిన పదార్థాలు


  • క్యాప్సికం. 1/4 కేజీ
  • టొమోటోలు. 100 గ్రా.
  • ఉల్లిగడ్డ. పెద్దది 1
  • అల్లంవెల్లుల్లి పేస్ట్. 1 టీస్పూ//.
  • షాజీరా, దాల్చిన చెక్క పొడి. 1/2 టీస్పూ//.
  • ధనియాలపొడి. 1 టీస్పూ//.
  • ఉప్పు, కారం. తగినంత
  • కొబ్బరిపొడి. 1 టీస్పూ//.
  • నూనె. తగినంత
  • పసుపు. చిటికెడు
  • కొత్తిమీర. కొద్దిగా

తయారు చేయు విధానం :


ముందుగా క్యాప్సికం, ఉల్లిపాయ, టొమోటోలను ముక్కలుగా కోసుకోవాలి.
స్టవ్ మీద బాణెలి పెట్టి నూనె వేసి వేడయ్యాక. ఉల్లిపాయ ముక్కలు, అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి దోరగా వేయించాలి.
ఆ తరువాత క్యాప్సికమ్ ముక్కలు వేసి చిన్న మంటమీద పది నిమిషాలు వేయించాలి. తరువాత టొమోటో ముక్కల్ని కూడా అందులో వేసి మరో ఐదు నిమిషాలు మగ్గబెట్టాలి.
ఆపై తగినంత ఉప్పు, కారం వేసి కలియబెట్టి షాజీరా దాల్చిన చెక్క పొడి, ధనియాలపొడి, కొబ్బరిపొడి, పసుపు కలపాలి.
కూర దగ్గరికి వచ్చేదాకా చిన్నమంటమీద అలాగే మరో ఐదు నిమిషాలు ఉడికించి, చివర్లో కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. అంతే క్యాప్సికమ్ కర్రీ రెడీ. 

నువ్వులతో బీరకాయ కూర


కావలసిన పదార్థాలు


  • బీరకాయలు. 500 గ్రా
  • ఉల్లిపాయ. 1
  • పచ్చిమిర్చి. 2
  • నువ్వులు. 1.1/2 టీస్పూ//.
  • పసుపు. 1/4 టీస్పూ//.
  • ఉప్పు. రుచికి తగినంత
  • నూనె. 1/2 టీస్పూ//.
  • పోపు కోసం
  • ఆవాలు జీలకర్ర. 1 టీస్పూ//.
  • మినప్పప్పు. 3/4 టీస్పూ//.
  • శనగపప్పు. 1 టీస్పూ//.
  • ఎండుమిర్చి. 2
  • కరివేపాకు. 2 రెమ్మలు

తయారు చేయు విధానము :


బీరకాయ ముక్కల్లో మూడు, 4 టీస్పూన్ల నీళ్లు కలిపి అందులో ఉప్పు, పసుపువేసి సన్నటి మంటపైన నీళ్లు ఇంకిపోయేదాకా ఉడికించాలి.
బాణెలి లో నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిర్చి వేసి దోరగా వేయించాలి.
అందులోనే కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కూడా వేసి ఐదు నిమిషాలు వేయించాలి.
తరువాత ఉడికించి ఉంచుకున్న బీరకాయ ముక్కలను పోపులో కలిపివేయాలి.
అలాగే మూడు నిమిషాలు ఉడికించాక, నువ్వుల పొడి చల్లి దించేయాలి. అంతే బీరకాయ నువ్వుల కూర రెడీ.

పెసల కూర


కావలసిన పదార్థాలు


  • పెసర మొలకలు. 1/2 కప్పు
  • ఉల్లిపాయలు. చిన్నవి 2
  • టొమోటోలు. 2
  • పచ్చిమిర్చి. 2
  • నూనె. మూడు టీస్పూ//.
  • మంటినీరు. 1/4 లీ.

తయారీ విధానం


పెసల్ని ముందురోజే నానబెట్టుకోవాలి. నీళ్లు వంపేసి బట్టలో కట్టి ఓ రోజు ఉంచితే మొలకలు వస్తాయి.
ఉల్లిపాయను ముక్కలుగా కోయాలి. సగం ఉల్లి ముక్కలు, పచ్చిమిర్చి, టొమాటో ముక్కలు కలిపి మిక్సీలో మెత్తగా రుబ్బాలి.
స్టవ్‌మీద బాణెలి పెట్టి ఉల్లిపాయ ముక్కలు వేసి బంగారువర్ణంలోకి వచ్చేవరకూ వేయించాలి.
తరువాత ఉల్లిముద్ద కూడా వేసి మూడు నిమిషాలు వేయించాక మొలకలొచ్చిన పెసల్ని కూడా వేయాలి.
ఇప్పుడు మంచినీళ్లు పోసి మంట తగ్గించి సిమ్‌లో ఉంచి 5-10 నిమిషాలు ఉడికించి దించాలి.
కిందికి దించేశాక కొన్ని పచ్చి ఉల్లిముక్కలు, కొత్తిమీరతో అలంకరించి వేడివేడి రోటీలతో పాటు వడ్డించాలి. అంతే రోటీలకోసం పెసర సబ్జీ రెడీ.