Thursday, May 10, 2012

మసాలా బీరకాయ


కావలసిన పదార్థాలు


  • బీరకాయలు. 1 కేజీ
  • కారం. 1 టీస్పూ//.
  • ఉల్లిపాయలు. 2
  • నూనె. తగినంత
  • లవంగాలు. 2
  • పచ్చిబఠాణీలు. 100 గ్రా.
  • టమోటోలు. 2
  • ధనియాలు. 2 టీస్పూ//.
  • అల్లం వెల్లుల్లి ముద్ద. 2 టీస్పూ//.
  • పసుపు... 1/2 టీస్పూ//.
  • యాలకులు... 2
  • దాల్చిన చెక్క... కొద్దిగా

తయారు చేయు విధానం :


బీరకాయలకు చెక్కుతీసి చిన్న ముక్కలుగా చేయాలి. ధనియాలు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్కలను పొడి చేసుకోవాలి.
ఉల్లిపాయలను సన్నగా తరగాలి. స్టవ్‌పై బాణెలి పెట్టి నూనె పోసి కాగాక అందులో ఉల్లిపాయ తరుగు, బీరకాయ ముక్కలు, టొమోటో ముక్కలు, ఉప్పు, పసుపు, కారం, అల్లం, వెల్లుల్లి ముద్ద, పచ్చి బఠాణీలు వేసి కాసేపు వేయించి తగినన్ని నీళ్ళుపోసి ఉడికించాలి.
కూర ఉడికాక, పైన నూరుకున్న పొడిని చల్లాలి. చివర్లో సన్నగా తరిగిన కొత్తిమీరను చల్లి దించేయాలి. అంతే మసాలా బీరకాయ రెడీ అయినట్లే.

మెంతాకు-పనీర్ కూర


కావలసిన పదార్థాలు


  • పనీర్. 400 గ్రా.
  • శెనగపిండి. 1 కప్పు
  • నూనె. 2 టీస్పూ//.
  • మెంతి ఆకులు. 2 కప్పులు
  • మిరియాలపొడి. 1/2టీస్పూ//.
  • జీలకర్ర. 1 టీస్పూ//.
  • టొమోటో గుజ్జు. 1/2 కప్పు
  • నీళ్లు. తగినన్ని
  • తాజా మీగడ. 1 టీస్పూ//.
  • ఉప్పు. సరిపడా

తయారు చేయు విధానం :


శెనగపిండిలో ఉప్పు కలిపి ఉంచాలి. పనీర్‌ను పెద్ద పెద్ద ముక్కలుగా కోసి, శెనగపిండిలో దొర్లించాలి.
వెడల్పాటి బాణెలి లో కొద్దిగా నూనె వేసి పనీర్ ముక్కల్ని బంగారు వర్ణం వచ్చేదాకా వేయించి పక్కన ఉంచాలి.
ఇప్పుడు అదే బాణెలి లో మిగిలి ఉన్న నూనెలోనే టొమోటో గుజ్జు, మిరియాలపొడి, ఉప్పు, వేయించిన జీలకర్ర పొడి, మెంతి ఆకులు, నీళ్లు పోసి అరగంటసేపు తక్కువ మంటమీద ఉడికించాలి.
తరువాత పనీర్ ముక్కలు వేసి కాస్త గ్రేవీ ఉండగానే దించి పైన మీగడ వేసి కలిపి వడ్డించాలి. 

పనీర్తో బెండకాయ


కావలసిన పదార్థాలు


  • లేత బెండకాయలు. 1/2 కేజీ
  • పనీర్. 2 కప్పులు
  • టొమోటోలు. 2
  • కారం. 1 టీస్పూ//.
  • జీలకర్ర. 1 టీస్పూ//.
  • నూనె. 6 టీస్పూ//.
  • ఉప్పు. సరిపడా
  • కొత్తిమీర. కొద్దిగా

తయారీ విధానం


బెండకాయల్ని శుభ్రంగా కడిగి ఒక మంచి గుడ్డతో తుడవాలి. వాటికి మొదలు, చివర్లను కట్ చేసి, గాట్లను పెట్టాలి.
ఒక బాణెలి లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక టొమోటో గుజ్జు, కారం, జీలకర్ర, ఉప్పు, పనీర్ ఒకదాని తరువాత ఒకటి వేసి కలపాలి.
అన్ని పదార్థాలను రెండు నిమిషాలు వేయించి దించేయాలి. గాట్లు పెట్టిన బెండకాయల్లో పై మిశ్రమాన్ని నింపాలి.
అడుగు మందంగా ఉండే మరో పాన్‌లో మిగతా నూనె వేసి వేడయ్యాక స్టఫ్డ్ బెండకాయల్ని వేసి మూతపెట్టి, సన్నటి మంటమీద పదిహేను నిమిషాలపాటు వేయించాలి.
మాడకుండా జాగ్రత్తపడుతూ వేయించి, పైన కొత్తిమీర చల్లి దించేయాలి. అంతే పనీర్ స్టఫ్డ్ బెండీ సిద్ధమైనట్లే.

టొమోటో మసాలా కూర


కావలసిన పదార్థాలు


  • టొమోటోలు. 1/2 కేజీ
  • నూనె. సరిపడా
  • గసగసాలు. 2 టీస్పూ//.
  • జీడిపప్పులు. 20
  • నువ్వులు. 2 టీస్పూ//.
  • చింతపండు. 2 నిమ్మకాయలంత
  • ఉల్లిపాయలు. 4
  • ఉప్పు, కారం. తగినంత
  • పసుపు. 1/2 టీస్పూ//.
  • అల్లంవెల్లుల్లి పేస్ట్. 2 టీస్పూ.
  • మసాలాపౌడర్. 2 టీస్పూ.
  • కొత్తిమీర. 2 కట్టలు

తయారీ విధానం


ఒక టీస్పూన్ నూనెలో గసగసాలు, రెండు ఉల్లిపాయల తరుగు, జీడిపప్పు, నువ్వులు వేసి దోరగా వేయించాలి.
చల్లారిన తరువాత ముందే నానబెట్టి ఉంచిన చింతపండుతో సహా ఉప్పు, కారం జతచేసి మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
స్టవ్‌పై బాణీలి పెట్టి.. రెండు ఉల్లిపాయల తరుగు వేసి దోరగా వేయించాలి.
తరువాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, తరిగి ఉంచుకున్న టొమోటో ముక్కల్ని వేసి వేయించాలి.
కాసేపటి తరువాత ముందే నూరి ఉంచుకున్న మసాలాను వేసి బాగా కలిపి పది నిమిషాలపాటు ఉడికించాలి.
దించేముందు మసాలాపొడి వేసి కలిపి. పైన కొత్తిమీర తరుగు చల్లి దించేయాలి. అంతేటొమోటో మసాలా కర్రీ సిద్ధమైనట్లే.

బంగాళాదుంప-వంకాయ కూర


కావలసిన పదార్థాలు


  • వంకాయలు. 2
  • బంగాళాదుంపలు. 4
  • పసుపు. 1 టీస్పూ//.
  • కారం. 2 టీస్పూ//.
  • నూనె. వేయించేందుకు సరిపడా
  • గరంమసాలా. 2 టీస్పూ//.
  • నిమ్మరసం. 1 టీస్పూ//.
  • కొత్తిమీర తురుము. కొద్దిగా
  • ఉప్పు. తగినంత
  • నూనె. నాలుగు టీస్పూ//.

తయారు చేయు విధానము :


వంకాయని పలుచని గుండ్రని ముక్కలుగా కోసి. వాటిమీద ఉప్పు, కారం, పసుపు చల్లి పక్కన ఉంచాలి. బాణెలిలో నూనె పోసి ఈ ముక్కల్ని వేయించి తీయాలి.
బంగాళాదుంప ముక్కల్ని ఉడికించి తొక్క తీసి, ఉప్పు, గరంమసాలా వేసి మెత్తగామెదపాలి.
వంకాయ ముక్కల్ని చిన్నపాటి చిప్పల్లా చేసి అందులో ఉడికించిన బంగాళాదుంప ముక్కల మిశ్రమాన్ని పెట్టాలి.
స్టవ్‌మీద బాణెలి పెట్టి 2 టీస్పూన్ల నూనెని చిలకరించి బంగాళాదుంపల మిశ్రమం పెట్టిన వంకాయ ముక్కల్ని బాణలిలో పెట్టి తక్కువ మంటమీద 2 నిమిషాలు మగ్గనిచ్చి దించేయాలి.
చివరగా కొత్తిమీర చల్లి నిమ్మరసం పిండి వడ్డించాలి. అంతే ఆలూ వంకాయ స్పెషల్ రెడీ .

పచ్చిబఠాణీ కర్రీ


కావలసిన పదార్థాలు :


  • పచ్చి బఠాణీలు. 1/4 కేజీ
  • నెయ్యి. 2 టీస్పూ//.
  • ఇంగువ. చిటికెడు
  • జీలకర్ర. 1/4 టీస్పూ//.
  • పసుపు. 1/4 టీస్పూ//.
  • కారం. 1/4 టీస్పూ//.
  • మంచినీళ్ళు. 3/4 కప్పు
  • ఎండుమామిడి పొడి. 1/4 టీస్పూ//.
  • ఉప్పు. తగినంత
  • కొత్తిమీర తురుము కొద్దిగా

తయారు చేయు విధానము :


బాణెలిలో నెయ్యి వేసి వేడి చేయాలి. తరవాత ఇంగువ, జీలకర్ర, పసుపు, కారం వేసి పచ్చిబఠాణీలు వేసి తిప్పాలి.
సరిపడా నీళ్లు పోసి మూతపెట్టి సిమ్‌లో ఉడికించాలి.
బఠాణీలు ఉడికిన తరవాత ఉప్పు, ఎండుమామిడికాయ పొడి వేసి కలిపి, కొత్తిమీర వేసి దించితే మటర్‌ కీ బఠానీ సబ్జీ రెఢీ!

మీగడతో పెసరపప్పు కూర


కావలసిన పదార్థాలు


  • పొట్టుతీయని పెసరపప్పు. 1/4 కేజీ
  • మీగడ. 1/4 కప్పు
  • నూనె. 2 టీస్పూ//.
  • పచ్చిమిర్చి. 10
  • అల్లం. చిన్నముక్క
  • ఉల్లిపాయలు. మూడు
  • ఉప్పు. తగినంత
  • టొమోటో గుజ్జు. 1.1/2 కప్పు
  • నెయ్యి. 1 టీస్పూ//.
  • పుదీనా. కొద్దిగా
  • ఉల్లితరుగు. 1/4 కప్పు

తయారు చేయు విధానము:


బాణెలిలో నూనె వేసి, పెసరపప్పు దోరగా వేయించి తీయాలి. వేయించిన పప్పుని బాగా నీళ్లతో కడిగి తగినన్ని నీళ్లు, పసుపు వేసి ఉడికించాలి.
పప్పు ఉడికిన తరవాత పచ్చిమిర్చి, అల్లం, ఉల్లిపాయముక్కలు వేసి ఉడికించాలి. పప్పుని బాగా మెదపాలి.
తరవాత ఉప్పు, టొమాటో గుజ్జు వేసి, కలిపి సిమ్‌లో పెట్టి ఉడికించాలి. చివరగా మీగడ కూడా కలిపి మరో మూడు నిమిషాలు సిమ్‌లో ఉంచి దించేయాలి.
మరో బాణెలిలో నెయ్యి వేసి ఉల్లిపాయముక్కలు పుదీనా ఆకులు వేసి వేయించి పప్పులో కలపాలి. అంతే వేడి వేడి మీగడతో పెసరపప్పు కూర రెఢీ.