పసిపిల్లల్ని కంటికి రెప్పలా చూసుకోవాలి. స్నానం
చేయించేటప్పుడు, పాలుపట్టించేటప్పుడు, అన్నం తినిపించేటప్పుడు ఎలా
జాగ్రత్తలు తీసుకుంటామో పిల్లలకు అన్నం పెట్టడానికి వాడే వస్తువుల
విషయంలోనూ అంతే అప్రమత్తతతో వ్యవహరించాలి. అందుకే పిల్లల అహార వేళలో
తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్నింటిని ఇక్కడ ఇస్తున్నాం.
- పిల్లలకి తినిపించడానికి ఉపయోగించే వస్తువులు అన్ బ్రేకబుల్ అయ్యుండాలి. ప్లాస్టిక్ వస్తువులైతే అందులో అన్నం పెట్టి తినిపించడం మంచిదో కాదో తెలుసుకోవాలి.
- మైక్రోవేవ్‌లో ఆహారం వేడిచేస్తే మొదట కొద్దిగా మీరు రుచి చూసిన తర్వాతే పిల్లలకు పెట్టాలి. అలాగే ఇందులో ఆహారపదార్ధాలను వేడి చేసేటప్పుడు వాడే వస్తువుల విషయంలోనూ జాగ్రత్త వహించాలి.
- పసిపిల్లలకు స్పూన్లు అలవాటు చేయాలంటే గుండ్రని ఆకారంలో ఉన్న ప్లాస్టిక్ స్పూన్లనిచ్చి తినమనాలి. ప్లాస్టిక్ ఫోర్కులు కూడా ఇవ్వొచ్చు.
- గిన్నెలు, కప్పుల అడుగుబాగం వెడల్పుగా ఉంటే అందులోని పదార్ధాలు తొందరగా నేలపై చిందవు.
- ఆరునెలలొచ్చిన పిల్లలు నిటారుగా కూర్చోవడానికి ప్రయత్నిస్తుంటారు. కాబట్టి వెనుకభాగం బాగా ఎత్తుగాఉండే ట్రే ఆకారం కుర్చీలో కూర్చోబెట్టి తినిపించాలి. ఇలా చేస్తే తినే ఆహారం నేలపై పడదు. కుర్చీ ఒక్కదాన్నే శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. దాన్ని శుభ్రం చేయడానికి ఎక్కువ సమయం పట్టదు కూడా.
- కొన్ని పదార్ధాలు గట్టిగా ఉండి గొంతుకు అడ్డంపడతాయి. కొన్నిసార్లు ద్రాక్షలాంటి మెత్తటి పదార్ధాలు సైతం తినే పద్దతిలో తినకపోతే ప్రాణాల మీదకు వస్తుంది. అందుకే పిల్లలు ఏం తింటున్నారన్న విషయం గమనించాలి.
- పిల్లలు టేబుల్‌పై తినేటప్పుడు వేడి పదార్ధాలు టేబుల్‌పై ఉంచొద్దు. ముఖ్యంగా టేబుల్ అంచున వీటిని అస్సలు పెట్టద్దు.
- వేడి పదార్ధాలు వడ్డించేటప్పుడు అవి పసిపిల్లలు తినగలగలిగిన ఉష్ణోగ్రతలోనే ఉన్నాయా లేదా చూసుకోవాలి.
- కొద్దిగా పెద్దగా ఉన్న పిల్లలకు పచ్చికూరగాయలు, పండ్లు తినిపించాలనుకుంటే వాటిని బాగా కడిగి పెట్టాలి. మందంగా తొక్క ఉండే దోసకాయలు, పుచ్చకాయలు, యాపిల్స్ వంటి వాటిని వెజిటబుల్ బ్రష్‌తో శుభ్రం చేసి గోరువెచ్చటి నీళ్లలో కడిగి ఆ తర్వాత పిల్లలకి పెట్టాలి. అరటిపళ్లు, కమలాల తొక్క సులువుగా తీయొచ్చు కాబట్టి వాటిని కడగకుండా కూడ పిల్లల చేతికి ఇవ్వొచ్చు.
- పిల్లలకు తిండి పెట్టే వస్తువులను వేడి నీళ్లతో కడిగితే మంచిది.
No comments:
Post a Comment