ఆహారపదార్థాల తయారీ, వాటిని భద్రపరచే విధానాలు తెలిసి
ఉంటే అనేక రకాల ప్రమాదకర వ్యాధులను ఆదిలోనే అరికట్టవచ్చు. పదార్థ
స్వభావాన్ని బట్టి వేడిగా లేదా చల్లగా ఉంచుతుంటాం. కానీ ఎంత ఉష్ణోగ్రత వరకు
వేడిగా ఉంచవచ్చు. చల్లదనం అంటే ఎన్ని డిగ్రీలు? వాటిని వాడుకునేటప్పుడు
గది ఉష్ణోగ్రతకు తీసుకురావాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో
తెలుసుకుందాం.
వేడిగా ఉంచాల్సినవి
- ఆహారాన్ని ఎంత ఉష్ణోగ్రత వరకు వేడి చేయాలనే ఆయా పదార్థాల మీద, వంటకు వెచ్చించే సమయం మీద ఆధారపడి ఉంటుంది. ఉదా.కు జంతు మాంసాలను మైక్రోఓవెన్లో వండేటప్పుడు 165 డిగ్రీల ఫా.హీ (73.8 డిగ్రీల సెల్సియస్) ఉండాలి.
- ఆహారంలోని తడిని కాపాడటంకోసం మూతపెట్టి ఉంచాలి.
- ఆహారం తయారైన తరువాత వడ్డనకు ముందు కనీసం రెండు నిమిషాలు మూతపెట్టి ఉంచాలి.
- మైక్రోవోవెన్‌లో ఆహారం సమంగా ఉడకదు కాబట్టి ఆహారపు ఉష్ణోగ్రతను వివిధ ప్రదేశాల్లో చూడటం మంచిది.
- ఆహారం ఉడికేటప్పుడు బ్యాక్టీరియా నాశనమైనప్పటికీ సాధారణమైన ఉష్ణోగ్రతల్లో మళ్ళీ ఆహారంలోకి చేరి వృద్ధి చెందుతుంది. కాబట్టి వడ్డించే వరకూ ఆహారాన్ని వేడిగా ఉంచడం అవసరం.
- స్టీంటేబుల్స్, సూప్ వార్మర్లు వంటివి ఆహారాన్ని వేడిగా ఉంచుతాయి. అయితే ఆహారం తయారైన తరువాత కాకుండా వీటీని ముందుగానే సిద్దంగా ఉంచుకోవాలి. వీటి మీద ఉంచిన ఆహారాల ఉష్ణోగ్రత 140 డిగ్రీల ఫా.హీ. (60 డిగ్రీల సెల్సియస్) వద్దగాని, ఆపైన గాని ఉండటం అవసరం.
- వేడిగా ఉండే ఆహార పదార్ధాలమీద మూతలతో కప్పిఉంచటం, ఆహారాన్ని మధ్య మధ్యలో కలియబెడుతూ లోపలుండే వేడిని సమంగా పరుచుకునేలా చేయటం, చల్లనిపదార్థాలను వేడి పదార్థాలతో కలవకుండా ఉండటం వంటివి చేస్తే ఆహారపదార్థాలు సమానమైన ఉష్ణోగ్రతలో ఉంటాయి.
- కొన్ని సందర్భాల్లో చల్లబడిన ఆహారపదార్థాలను తిరిగి వేడిచేసి వడ్డించాల్సి వస్తుంది. సరైన రీతిలో చల్లబరిచిన ఆహారాలను వేడిచేసి వెంటనే వడ్డించేట్లైతే పెద్దగా నష్టం ఉండదు. కాకపోతే చల్లారిన వాటిని రెండు గంటలోపల మాత్రమే తిరిగి వేడిచేసి వాడుకోవాలి.
- చల్లబడిన ఆహారాన్ని 165 డిగ్రీల ఫారెన్‌హీట్ (73.8 డిగ్రీల సెల్సియస్)కు చేరుకునేలా త్వరితగతిన వేడిచేయటం అవసరం.
చల్లగా ఉంచాల్సినవి
- ఆహారపదార్థాలను తక్కువ ఉష్ణోగ్రతలో చల్లగా ఉంచితే బ్యాక్టీరియా పెరగకుండా ఉంటుంది. రిఫ్రిజిరేటర్, ఐస్ వంటివి ఉపయోగించి ఆహారాన్ని చల్లగా ఉంచవచ్చు.
- ఐస్‌ను వాడేటప్పుడు అది ఆహారాన్ని పూర్తిగా కప్పేలా ఉండాలి.
- ఆహారపదార్థాలు చెడిపోకుండా చల్లగా ఉంచాలనుకుంటే వాటి ఉష్ణోగ్రత 41 డిగ్రీల ఫారెన్‌హీట్ (5 డిగ్రీల సెల్సియస్)గాని, అంతకంటే తక్కువగాని ఉండాలి.
- ఒకవేళ సలాడ్లు చల్లగా ఉండాలంటే తయారు చేసిన తరువాత 4 గంటల లోపల 41 డిగ్రీల గా. హీ. (5 డిగ్రీల సెల్సియస్) ఉష్ణోగ్రతకు చల్లబర్చాల్సి ఉంటుంది.
- చల్లదనంతో గడ్డకట్టిన ఆహారపదార్థాలను వినియోగించేటప్పుడు తిరిగి సాధారణ ఉష్ణోగ్రతకు తీసుకువచ్చేటప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే బ్యాక్టీరియా పెరిగే ప్రమాదం ఉంది.
- ఆహారపు లోపలిపొరలు చల్లగా గడ్డకట్టినా వెలుపలి పొరలు కరగటంతో పైపైన బ్యాక్టీరియా చేరుతుంది.
- ఆహారలను తక్కువ ఉష్ణోగ్రతలకు చల్లబరిచేందుకు మూడు పద్దతులు ఉన్నాయి.
- మొదటి విధానంలో, అన్నం, పప్పు, ఉడుకించిన బంగాళదుంపలు వంటివాటిని వెడల్పాటి ప్యాన్‌లలో రెండంగుళాలకు మించి మందం లేకుండా పల్చగా సర్ది, చల్లారిన తరువాత ఫ్రిజ్ పైభాగంలోని అరల్లో పెట్టి 41 డిగ్రీల ఫారెన్‌హీట్ కు (5 డిగ్రీల సెల్సియస్ ) చేరుకున్న తరువాత మూతపెట్టి చల్లబర్చాల్సి ఉంటుంది.
- ఉడికించిన పెద్ద పెద్ద మాంసపు ముక్కలను చిన్నగా తరిగి పాన్‌లో వెడల్పుగా సర్ది ఫ్రిజ్‌లో ఉంచి 5 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకున్న తరువాత మూతపెట్టడం రెండవ పద్దతి.
- వేడిగా ఉండే సూపులు, గ్రేవీలను చల్లబరచడానికి మూడోపద్దతి ఉపయోగపడుతుంది. ముందుగా వేడి సూప్‌ను ఒక గిన్నెలో తీసుకొని చల్లని ఐస్ నీళ్ళలో ఉంచి చల్లబరచాలి. సూప్ మరీ వేడిగా ఉంటే మధ్య మధ్యలో గరిటెతో తిప్పుతూ చల్లబరచవచ్చు.
- మొదటి రెండు గంటల్లో 70 డిగ్రీల ఫారెన్‌హీట్ (21 డిగ్రీల సెల్సియస్) ఉష్ణోగ్రతకు తీసుకువచ్చి, ఆ తరువాత మిగిలిన ఆరు గంటల్లో 41 డిగ్రీల ఫారెన్ హీట్‌కు (5 డిగ్రీల సెల్సియస్) తగ్గించి మూత పెట్టి నిల్వ చేయాలి.
No comments:
Post a Comment