Tuesday, August 14, 2012

పచ్చడి పెడుతున్నారా?


బజారులో ఉసిరికాయలు నోరూరింపజేస్తున్నాయి. చాలామంది ఈపాటికి పచ్చడి పెట్టేసే ఉంటారు. సమయము ఉండదుకదా అని...వీలున్నప్పుడల్లా ఊరగాయలు పెడుతుంటే రెండురోజులకల్లా బూజు పట్టేస్తుంటాయి కొందరికి. ఇక్కడలోపం ఊరగాయకి కావలసిన దినుసులను ఎంచుకోవడంలో కాదు. తయారీలోనే ఉంది అందుకే మరి ఈ జాగ్రత్తలు పాటించమంటున్నది.
  1. నిర్లక్ష్యం చేయకుండా ఊరగాయలకు వాడే పాత్రలు, గిన్నెలు, గరిటలు పరిశుభ్రంగా కడిగి, పొడివస్త్రంతో తుడవాలి. లేదంటే ఆపాత్రలను స్టౌపై వుంచి వేడి తగలటంవల్ల వాటిల్లోని కొద్దిపాటి తడికూడా పోతుంది.
  2. ఇక పచ్చళ్ళు నిల్వచేసే గాజు సీసాలు, జాడీలనూ కొంచంసేపు ఎండలో పెట్టడం మంచిది.
  3. ఊరగాయలు జాడిలోకి తీసినతరువాత చాలామంది వాటిపై వస్త్రం కూడా చుడుతుంటారు. అది ఒకవిధంగా మంచిదే అయితే మూత గట్టిగా ఉండే వస్తువులు ఇప్పుడు చాలానే అందుబాటులోకి వస్తున్నాయి.
  4. స్టీలు, రాగి వంటి పాత్రలలో పచ్చళ్ళను భద్ర పరచకూడదు.
  5. ఊరగాయలలో వాడే కూరగాయలు మెత్తగా లేకుండా చూసుకోవాలి.
  6. నూనె, ఉప్పు, కారం వంటి పదార్ధాలు కలిపేటప్పుడు చెక్కగరిటతో కలపడం మంచిది. వడ్డించుకునేటప్పుడు చిన్న వాటిలోకి మార్చుకోని స్టీలు స్పూన్స్ వాడవచ్చు.

వేసవిలో అందరూ మామిడికాయలతో రకరకాల పచ్చళ్ళను తయారుచేస్తారు. వాటిలో ప్రధానంగా అందరూ తయారుచేసేది ఆవకాయ. ఈ పచ్చడిని ఈ కాలమే తయారుచేసుకోని సంవత్సరమంతా నిలవ వుంచుకోవాలి. సంవత్సరమంతా పచ్చడి పాడవకుండా వుండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
  • ఆవకాయకు వాడే మామిడికాయను ఎంచుకోవడంలో చాలా జాగ్రత్త అవసరం. పగిలిన కాయలు, మెత్తగా వున్నకాయలను ఆవకాయకు వాడకూడదు.
  • మామిడికాయ తొక్క దళసరిగా, పీచు ఎక్కువగా వుంటే సంవత్సరమంతా ముక్క మెత్తగాకాకుండా వుంటుంది.
  • ఆవకాయలో కలిపే కారం, ఉప్పు, ఆవపిండిని కావలసిన పళ్ళాలో కలపాలి. ఆవకాయలో పచ్చిమెంతులు, శనగలు వేస్తే రుచిగా, సువాసనగా వుంటుంది.
  • పచ్చడిలో ఏనూనెపడితే ఆ నూనె పోయకూడదు. బ్రాండెడ్ నువ్వుల నూనెకానీ పప్పునూనెకానీ వాడాలి.
  • ఆవకాయ కలిపాక గాలి తగలకుండా జాడీలో పెట్టి మూడవరోజు తిరగ కలిపి కొంచెం తీసుకోని అన్నంలో కలుపుకొని తిని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి. ఉప్పు సరిపడినంత వుండాలి. లేకపోతే వర్షాకాలం వచ్చేసరికి ఆవకాయ పాడైపోతుంది.
  • ఆవకాయను సీసాలు, ప్లాస్టిక్ డబ్బాల్లో పెట్టడం కన్నా జాడీల్లో పెడితేనే తాజాగా వుంటుంది.
  • ఆవకాయ జాడిలో పెట్టిన తర్వాత మర్నాడు నూనె పైకి తేలిందో లేదో చూడాలి. అవకాయ మునిగేలా నూనె పోయాలి. అప్పుడే ఆవకాయ నిలవ ఉంటుంది. మంచి రంగుతో సంవత్సరమంతా తాజాగా వుంటుంది.

No comments:

Post a Comment