Monday, May 19, 2014

కులవృత్తి....

చదువుకున్న వారు పెద్ద వేదవోలోయ్. వాళ్ళకి పుస్తక జ్ఞానమే కాని లోక జ్ఞానం బొత్తిగాలేదోయ్ అని "గిరీశం" ఎప్పుడో అనేశాడు. అప్పుడు ఎవరికీ పెద్దగా దీనిమీద అబిప్రాయం లేదు. ఈ మధ్య మాత్రం గొడవలు తెగ ఎక్కువైపోయాయి.

     ఒకడు మా అమ్మ యమ్ ఏ చదివింది. నాన్న యమ్ బి ఏ చేశాడు. నేను ఏం సి ఏ చేసి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నాను. నా వయస్సు 30 ఏళ్ళు. ఉద్యోగాలలో పోటి ఎక్కువై ప్రయత్నిస్తూనే ఉన్నాను అన్నాడు. అమ్మవిశాఖపట్నం లో ఉంటుంది., నాన్న హైదరాబాద్ లో ఉంటాడు. నేను ఒక్కడినే విజయవాడలో ఉంటాను. రెండు నెలలకి కానీ పండగలకి కాని అందరం కలిసి బాగా ఎంజాయ్ చేస్తాము.

     ఇంకొకడు. మా అమ్మ 3వ తరగతి చదివింది. ఇంట్లో ఉంటుంది. నాన్న 5వ తరగతి చదివాడు. ఇంటిదగ్గరే కులవృత్తి చేస్తుంటాడు. అప్పుడప్పుడు అమ్మ కూడా నాన్నకి సాయం చేస్తుంది. నేను 10 చదివాను. నాన్న వృత్తిలో నేను చిన్ననాటి నుండి ఉండటం వలన పనిలో మేళుకువలు నేర్చుకున్నాను. పనిలో మానాన్న కంటే కొత్తదనం చూపించడం వలన చేస్తున్నపని పురోగమించి బాగానే సంపాదించుకున్నాను. 21 ఏళ్లకే పెళ్ళయ్యింది. ఇద్దరు పిల్లలు. ఇప్పుడు నా వయస్సు వయస్సు 25 సంవత్సరాలు. మేము అందరం ఒకే ఇంట్లో కలిసే ఉంటాము. మా ఇంట్లో ఎప్పుడూ పండగే అన్నాడు.

         నిజమే! ఈరోజు యువతి యువకుల్లో చదువుల వలన వయస్సు పెరిగిపోతుంది. దీనికి తోడు అతి చదువులవలన చిన్న పనులు చేయలేక, పెద్ద ఉద్యోగాలు దొరక్క అవివాహితులుగా, నిరుద్యోగులుగా మారిపోతున్నారు. కులవృత్తులు తల్లిదండ్రులే చేయనివ్వడంలేదు. ఒకవేళ చెయ్యాలని ముందుకొచ్సినా "ఇంత చదువు చదివి ఇవన్నీ నీకెందుకురా" అంటూ చేసే పనికూడా చేయనివ్వడంలేదు. చదువు వలన వచ్చిన అహంకారం వలన ఎవరైనా మంచి కోరి ఏదైనా చెప్తే ఎదురుచెప్పకుండా, సరే అనేవాడు ఒక్కడంటే ఒక్కడు కూడా లేడు.
అదేమంటే అంత చదువు చదివి ఏమి తెలియదు వీడికి అనంటారేమో అనే భయం ఒకటి. చదువు వలన వచ్చిన అహంకారం ఒకటి. గిరీశం ఎప్పుడో చెప్పిన మాటలని నిజం చేస్తున్నాయి.

        చదువుకున్నవారు తమకు తెలిసిన విషయాలే లోకం అని, చదువులేనివారు మూర్ఖులని అనుకుంటారు. కాని ఈ చదువులు ఎప్పుడోచ్చాయి. ఒక 50ఏళ్ళ క్రితం ఉన్నాయా? వాళ్ళందరూ పెద్ద చదువులు చదివారా? మీ బామ్మలని అడగండి. ఎంతచదివి మీ అమ్మా, నాన్నలని పెంచారని? వాళ్ళు చెప్పేది ఒక్కటే! మేము పెద్దగా ఏమి చదువుకోలేదు. మా నాన్న చేసిన వృత్తిలో నిలబడి చేశాననే అంటారు. అప్పట్లో నిరుద్యోగ సమస్య లేదు. ఎందుకంటే ఎవరి వృత్తిలో వారు నిలబడ్డారు. ఎంతోమందిని నిలబెట్టారు. కనుకనే మనం ఎన్నో లక్షల సంవత్సరాలు మనగలిగాము. మనగాలుగుతున్నాం.

        ఎంత చదివినా, ఎన్ని కోట్లు సంపాదించుకున్నా తిండి తినకుండా పూట గడవదు. మనం సాయంత్రం సరదాగా గడపడానికి బయటికి వెళితే అక్కడ చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారు ఎంతోమంది ఉంటారు. వాళ్ళు కూడా ఇవి నేనెందుకు చేయాలి అని ఆలోచిస్తే రోడ్డుపక్కన వ్యాపారాలు ఉండవు. నువ్వు వేసుకునే బట్టలు, తిరిగే వాహనాలు, వాటికి సమస్య వస్తే చేసే నాధుడు ఉండడు. గుడికెళ్ళి కొబ్బరికాయ కొట్టాలంటే నువ్వు జేబులో నుండి 10 తీసి కొన్నంత తేలికగా అక్కడికి కొబ్బరికాయలు రావు. ఆ కొబ్బరికాయ అక్కడివరకు రావాలంటే వాటి వెనక ఎందరో ఉన్నారు.
మీ చదువుని, చదువుకున్న తెలివిని మీ కులవృత్తులలో ఉపయోగిస్తే అనేక అద్భుతాలు సాధించవచ్చు. ప్రయత్నం చేయండి. కులవృత్తులను కాపాడండి.


No comments:

Post a Comment