Tuesday, May 20, 2014

ప్రాణధారలు - మన పానీయాలు

సహజసిద్దంగా లభించే వేసవి పానీయాల్లో అత్యంత ముఖ్యమైనవి, ఆరోగ్యకరమైనవి కొబ్బరినీరు, మజ్జిగ, నిమ్మరసం. వీటితో పాటు వివిధ రకాల పండ్ల నుండి కూడా రసాలను తీసి పండ్లరసాలుగా మార్చి అందిస్తున్నారు. వీటన్నింటిలో దాహాన్ని తీర్చే గుణంతో పాటు శరీరానికి అవసరమైన విటమిన్లను అందించే గుణం కూడా ఉండడం విశేషం.

కొబ్బరినీళ్లు:
కొబ్బరిచెట్టుకు కాసిన లేత కొబ్బరికాయలలో నిల్వ ఉన్న స్వచ్ఛమైన ద్రవాన్ని ‘కొబ్బరినీరు’ అంటారు. కొబ్బరికాయలో కొబ్బరిబీజం తయారు కావడానికి సిద్ధమవుతున్న దశలో కొబ్బరినీరు ఎక్కువగా ఉంటుంది. ఈ దశలో ఉన్న కొబ్బరికాయలోని నీరు మనిషికి బాగా ఉపయోగపడుతుంది. ఈ దశ దాటి అభివృద్ధి చెందుతున్న కొబ్బరికాయ లోపల వైపు కొబ్బరిపీచుకు అంటుకుని గట్టిగా కొబ్బరిచిప్ప తయారవుతుంది. నీరు రూపాంతరం చెందుతూ కొబ్బరి చిప్పకు లోపలి వైపున అంటుకుంటూ తెలుపు రంగుతో ఉన్న కొబ్బరి తయారువుతుంది.

కాగా, కొబ్బరినీరు తాగడం వల్ల నీరసంగా ఉన్నవారికి తక్షణ శక్తి లభిస్తుంది. మరోవైపు ఈ నీటిలో ఎలాంటి ఇతర పదార్థాలు కలవవు. కనుక ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగపడతాయి.

వేసవికాలం వచ్చిందంటే మనకు అన్ని ప్రాంతాలలోనూ కొబ్బరిబొండాలు విరివిగా లభిస్తుంటాయి. కాయ సైజును బట్టి, అందులో ఉండే నీటిని బట్టి ధర ఉంటుంది. అయితే ఇప్పుడు కొబ్బరినీరు ప్యాకెట్లలో, సీసాలలోనూ లభిస్తోంది. ఇప్పుడిప్పుడే కొబ్బరి నీరున్న సీసాలు మార్కెట్లో దర్శనమిస్తున్నాయి. అయితే కొబ్బరి నీళ్లను ఎలా ప్యాక్ చేసినా దాహాన్ని దరి చేరనివ్వని దాని మహత్తు మాత్రం అద్భుతం.

మజ్జిగ:
పెరుగును చిలికితే వచ్చేది మజ్జిగ. వేసవి తాపాన్ని తీర్చే సహజసిద్ధ అమృతం మజ్జిగ. దీన్నే మనం ‘చల్ల’ అనే అంటాం. వేసవితాపాన్ని తీర్చే ద్రవంగా మజ్జిగ ఉపయోగం తెలియంది ఎవరికి? కానీ, వాడటం ఇప్పటి తక్షణ అవసరం. మజ్జిగలో చక్కెర, ఐస్‌క్రీం వంటివి వేసి ‘లస్సి’ పేరుతో శీతల పానీయాన్ని తయారు చేయడం మనకు తెలిసందే.

అయితే, ఈ మజ్జిగ తయారీలో కాస్త శ్రద్ధ పెడితే మరీ మంచిది. ఊదాహరణకు, పెరుగులో కొన్ని నీళ్లు పోసి చిలికి, అందులో కొంచెం కరివేపాకు, అల్లం, పచ్చి మిరపకాయలు వేసి కొంతసేపు ఉంచితే మజ్జిగ ఇంకా రుచిగా తయారవుతుంది. దీన్ని దాహాన్ని తీర్చే చక్కని పానీయంగా ఉపయోగించవచ్చు,

కొంతమంది చలివేంవూదంలో నీటితో పాటు మజ్జిగను కూడా ఎండలో తిరుగుతున్న వారికి పంచుతారు. దీనివల్ల దాహం తీరడంతో పాటు శరీరానికి శక్తి లభిస్తుంది. నీటికి బదులు మజ్జిగ వేసి ఉప్మాను తయారు చేస్తారు. దీన్ని ‘మజ్జిగ ఉప్మా’ అంటారు. మజ్జిగను భోజనంలో చివరగా తింటుంటారు. అలాగే మజ్జిగను పోపుచేసి ‘మజ్జిగ చారు’, లేదా ‘మజ్జిగ పులుసు’(చల్ల పులుసు) ను తయారు చేస్తారు.

నిమ్మరసం 
వేసవికాలంలో విరివిగా లభించేవి నిమ్మకాయలు. వాటి రసానికి దాహాన్ని తీర్చే గుణం అధికంగా ఉంటుంది. అందువల్ల ఎవరింట్లోనైనా నిమ్మచెట్లు తప్పనిసరిగా ఉండేవి ( ఇప్పటి మాట కాదు).

నిమ్మపండులో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. రుచికి పుల్లగా ఉండే నిమ్మకాయలైతే మరీ మంచిది. ఇవి దాహన్ని తీర్చడంతో పాటు ఆరోగ్యానికి అవసరమైన విటమిన్లనూ అందిస్తాయి.

నిమ్మచెట్టు పొట్టిగా దట్టంగా ఉండి 10 అడుగుల ఎత్తు పెరుగుతుంది. కొమ్మలు ముళ్లతో ఉంటాయి. ఆకులు ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఆకుల కింది భాగంలో పత్ర పుష్పాలు రాలిన తర్వాత చిన్న బుడిపె మాదిరిగా తయారై అది పండుగా మారుతుంది. నిమ్మపండు గుండ్రంగా ఉండి ఒక చివర సూదిగా ఉంటుంది. పూర్తిగా పండిన నిమ్మపండు చర్మం ముదురు పసుపు రంగులో ఉంటుంది. పండులో తెల్లని చిన్నచిన్న విత్తనాలుంటాయి. 

నిమ్మరసం వేసవికాలంలో ఉప్పు లేదా చక్కెర కలిపి పానీయంగా తాగడం వల్ల దాహం తీరడంతో పాటు విటమిన్ సి లోపాన్ని అధిగమించవచ్చు. ఒక్కో నిమ్మపండు నుంచి ఇంచుమించు 3 చెంచాల రసం వస్తుంది.

ఎండాకాలంలో నిమ్మరసం కలిపిన సోడా విరివిగా లభిస్తుంది. అలాగే నిమ్మతో షర్బత్‌లు, నిల్వఉండే పానీయాలనూ తయారు చేస్తారు.


అన్నట్టు, ఎండన పడి వచ్చిన వారికి నిమ్మరసం ఇస్తే చాలు త్వరగా శక్తి వస్తుంది. అందుకే నిరాహార దీక్ష చేసి విరమించే వారికి నిమ్మరసం ఇస్తుంటారు.

నిమ్మరసంలో విటమిన్ సి ఉండడం వల్ల అది ఏంటీ -ఆక్సిడెంట్‌గా పనిచేసి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. సాధారంగా నిమ్మరసం ఎక్కువ తాగిన వారికి జలుబు చేస్తుందంటారు. కానీ జలుబు చేసిన వారికి నిమ్మరసం తాగిస్తే త్వరగా ఉపశమనం లభిస్తుంది. జీర్ణక్షికియలోనూ, వేడినీటిలో కలిపి సేవించడం వల్ల కాలేయానికి మంచిది. క్యాన్సర్‌ను నిరోధించడంలో కూడా నిమ్మది ముఖ్యపాత్ర.
నిమ్మ ఇప్పటిది కాదు. నిమ్మ గురించి మొదటిసారిగా 10వ శతాబ్ధంలోనే అరబ్ సాహిత్యంలో పేర్కొన్నారు. మన దేశంలో నిమ్మను పండించిన తొలి రాష్ట్రం అస్సాం.

గోలి సోడా
వేసవికాలంలో వీటికి అధికంగా గిరాకీ ఉండేది. ఒక సోడా తాగితే దాహం తీరడంతో పాటు తిన్న ఆహారం త్వరగా జీర్ణం అవుతుందన్న నమ్మకం ఉండేది. అందులోని గ్యాస్ మూలంగా తాగిన వెంటనే ముక్కుల్లోంచి, నోటిలోంచి గ్యాస్‌తో కూడిన త్రేన్పులు వస్తాయి. అలా వస్తేనే ఆ సోడా మంచిదని, తిన్నది జీర్ణమైందని నమ్మెవారు. సహజ సిద్ద నిమ్మకాయలతో తయారైనా నిమ్మరసం కనుక దాహం తీరడానికి కూడా ఈ గోలిసోడాలు తాగేవారు. కానీ ఇప్పుడు గోలిసోడా అనేదే లేదు. ఉన్నా అందులోనూ చాక్లెన్ ఫౌడర్ కలిపి ‘నిమ్మసోడా’ అని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు.
ఒకప్పుడు పచ్చని రంగు సీసాలో వేలుపెట్టి కొట్టగానే సీసపుగోలి వెనక్కు ‘కీస్’ మంటూ శబ్దం చేస గోలి సోడా జాడేమైందో తెలియదు. దీనిస్థానంలో వింత వింత సోడా బండ్లు బయలు దేరినయ్. కానీ ఆ సౌండే వేరు.. ఆ సోడా వేరు!

అంబలి:
వేసవితాపాన్ని తీర్చే మరో చక్కని ద్రవ పదార్థం అంబలి. అంబలికి పూర్వకాలం నుంచి మంచి ఆధరణ ఉంది. అంబలి రుచికి రుచి, ఆరోగ్యానికి అరోగ్యం అందిస్తుంది. అంతేకాదు, పోషక పదార్థాలు, పిండి పదార్థాలు ఉండే ఏకైక పానీయం అంబలి. దీన్ని ఎక్కువగా వేసవికాలంలోనే తయారు చేస్తారు.

అంబలి తయారీకి తెల్లజొన్నలు (రాగులు కూడా) ఉపయోగిస్తారు. తెల్లజొన్నలను పిండి పట్టించి ఆ పిండిలో నీళ్లు పోసి భాగా మరిగిస్తారు. అలా మరిగిన పానీయంలో ఉప్పు వేసుకుని తాగుతారు. ఇది దాహన్నే కాక ఆకలిని కూడా తీరుస్తుంది.

పేద ప్రజలు తినడానికి అన్నం లేని సమయంలో ఇలా అంబలిని తయారు చేసుకుని తాగేవారు. అంబలిలో చింతకాయపచ్చడి, కారం, ఇలాంటివి కలుపుకుని తాగుతారు. వేసవికాలంలో పేదలు, రోజువారి కూలీలు, ఆకలితో అలమటించే వారికోసం కొన్ని సంస్థలు అంబలి పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాయి. ఒక రకంగా ఇది పేదల పాలిట పరమాన్నం అనుకోవచ్చు. అందుకే ‘పరమాన్నం తిని మురిసేవారికి పట్టె మంచముల పండేవారికి అంబలి తాగీ ఆనందించే పేదల కున్న హాయిలేదురా’ అన్నారు.
ఏమైనా, ఎండాకాలంలో ‘అంబలి’ ఇటు కడుపు నింపుతుంది. అటు వేసవి తాపాన్ని తీరుస్తుంది.

క్షీరసాగర మథనం

సహజ సిద్ధంగా లభించే పండ్లరసాలు, శీతల పానీయాలను అమృతధారలుగా పిలుస్తుంటారు. అంటే పోయే ప్రాణాల్ని కాపాడే ప్రాణధారలన్నమాట. దీని పురాణాల్లో అనేక కథనాలున్నప్పటికీ ‘క్షీరసాగర మథనం’ చాలా ముఖ్యమైంది.

దేవతలు, దానవులు క్షీరసాగర మథనం చేస్తున్నపుడు వెలువడిన పానీయాన్నే ‘అమృతం’ అని అన్నారు. ఈ పానీయాన్ని సేవిస్తే మరణం ఉండదనేది ఆ కథలోని కథనం. అయితే దానవులు అంటే రాక్షసులకు అమృతం దొరికితే వారికి చావు ఉండదని, దాంతో దేవతలను, ప్రజలను వారు హింసిస్తారనే ఉద్దేశంతో విష్ణుమూర్తి మోహినీ అవతారమెత్తి దేవతలకు మాత్రమే అమృతాన్ని పంచాడని చెబుతారు.

ఈ పురాణగాథ ఎలా ఉన్నా దాహంతో ఉన్నవారికి దాహం తీర్చేది కనుక వారికిచ్చేది ఏదైనా అమృతంతో సమానమన్నది మనవాళ్ల అభివూపాయం. అమృతం ఎలా ఉందో ఎవరు చూడలేదు. కనుక ప్రాణాల్ని నిలిపేదాన్నే అమృతం అనడం అలవాటుగా మారింది. అవి చల్లనినీళ్లు కానీ అమృతమనే అంటారు. వాస్తవానికి ఆకలితో అలమటించేవాడికి పంచభక్షపరమన్నాలు పెట్టకున్నా...పచ్చడి మెతుకులే అమృతం, గొంతెండి నీటికోసం అన్వేసిస్తున్నవాడికి మజ్జిగ ఇవ్వకున్న మంచినీళ్లు ఇస్తే చాలు అవే వారికి అమృతంతో సమానం.

ప్రాచీన కాలంలో చైనా, భారత్‌తో పాటు చాలా యూరప్ దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు అమృతం లాంటి పానీయాన్ని తయారు చేయడానికి ఎంతో సమయాన్ని వెచ్చించారట. కానీ అది సాధ్యం కాలేదు. అమృతం అనే పానీయం ఉందని కానీ, లేదని కానీ, అది తాగితే మరణం ఉండదని కానీ చెప్పడానికి సరైన ఆధారాలు మాత్రం లేవు. కానీ నేడున్న అత్యధిక ఎండవేడిలో మంచినీళ్లు తాగకుంటే మాత్రం మరణం తప్పదన్నది వాస్తవం.

రసాలు
చెరకు రసం
ఇది కూడా సహజ సిద్దమైన పానీయమే. వేసవికాలంలో వివిధ ప్రాంతాల్లో చెరకు రసం బండ్లు మనకు కనిపిస్తాయి. అయితే, వీటితో పాటు నారింజ, ద్రాక్ష, కర్బూజ, పుచ్చకాయ, మామిడి, బత్తాయి, స్ట్రాబెర్రీ వంటివాటి నుండే రసాలు తీసి పండ్లరసాలుగా అమ్ముతున్నారు. కెమికల్స్‌తో తయారయ్యే కూల్‌వూడింక్స్‌తో పొలిస్తే ఈ రసాలన్నీ కూడా సహజసిద్ధమైన వేసవి పానీయాలనడంలో సందేహం లేదు. వీటితో దాహం తీరడమే కాకుండా శరీరానికి శక్తినిచ్చే గుణం కూడా ఉండడం వల్ల ఇవి చాలా ఉపయోకరమైనవి.

నారింజ

ఉష్ణదేశాల్లోనూ, సమశీతోష్ణ ప్రాంతాల్లోనూ పండించే నారింజ ఆంధ్రవూపదేశ్‌లో నంద్యాల, కోడూరు, వడ్లమూడి వంటి ప్రాంతాల్లో బాగా పండిస్తున్నారు. బత్తాయి, నిమ్మ జాతికి చెందిన నారింజలోనూ అవే జాతి గుణాలున్నాయి. కాకపోతే తీపి అదనం.
ఇవి వేసవికాలంలో కాస్తుంటాయి. వీటిలో నీటి శాతం కూడా తక్కువ. లవణాలు ఎక్కువ. ఇవి దేహానికి మేలు చేస్తాయి. కాబట్టి వేసవికాలంలో కాచే నారింజ పండ్లను తినడం ఆరోగ్యానికి ఉపయోకరం. విటమిన్ ఏ,బి,సి వీటిలో ఎక్కువగా లభిస్తాయి.

ఆరు ఔన్సుల నారింజ రసం తాగితే చాలు మనిషికి ఆ రోజుకు కావలసిన సి విటమిన్ లభిస్తుంది. దీన్ని రసం చేసుకొని తాగడం వల్ల కాల్షియం లభిస్తుంది. ఇందులో సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, రాగి, గంధకం, క్లోరిన్‌లు కూడా ఉన్నాయి. జీర్ణశక్తిని పెంచే శక్తి దీనికుంది. మలబద్దకాన్ని తగ్గించడంతో పాటు ఉబ్బసం, శ్వాసనాళ వ్యాధుల నివారణలోనూ, కపం, వాతం, ఆజీర్ణాలను హరించడం, బలం, తేజస్సు నివ్వడంలోనూ నారింజ ఉపకరిస్తుంది.

కర్బూజ
దోస జాతికి చెందిన పండు కర్బూజ. ఇవి క్రీస్తు పూర్వం రెండవ శతాబ్ధంలోనే గ్రీకుదేశంలో సాగులో ఉండేవి. రోమన్లు కూడా సాగుచేసేవారు. మొదట వాయవ్య భారతంలో సాగైన వీటిని తర్వాత చైనా, పర్షియా ప్రాంతాల్లోనూ పండించారు. అటు తర్వాత కాశ్మీర్, ఆఫ్ఘనిస్తాన్‌లలో కూడా అభివృద్ధి చెందాయి.

ఈ పండు వేసవిలో మంచి చలువ చేయడమే కాకుండా తీపిదనాన్ని అందిస్తుంది. ఆకలి మందగించడం, బరువు తగ్గడం, మలబద్దకం, మూత్రనాళ సమస్యలు, ఎసిడిటి, అల్సర్ వంటి సమస్యల నివారణకు ఈ గుజ్జును తగినంత నీటిలో కలిపి తాగితే మంచి మేలు చేస్తుంది.


శరీరంలో వేడిని తగ్గించడం, ఆకలిని పెంచడం, అలసటను తగ్గించడం, శరీరబరువును తగ్గించడం, లైంగిక శక్తిని పెంచడం ఈ పండు ఉపయోగాలు.

మలబద్దకాన్ని తగ్గించడం, రక్తపోటు, గుండె పనితనాన్ని మెరుగు పరచడం, కిడ్నీలలో రాళ్లను అరికట్టడం, ఎముకలకు బలాన్నివ్వడం కూడా కర్బూజ లక్షణాలు. వేసవికాలంలో కర్బూజలు విరివిగా లభిస్తాయి. వీటిలో సి, ఎ విటమిన్లు అధికంగా ఉంటాయి. కర్బూజ రసం తాగడం వల్ల శరీరానికి అవసరమైన శక్తి లభిస్తుంది.

ద్రాక్ష

అన్ని కాలాల్లోనూ విరివిగా లభించే పండ్లు ద్రాక్షలు. వేసవికాలంలో ద్రాక్షతో తయారైన జ్యూస్‌ను ఎక్కువగా తాగుతుంటారు. దీని నుండి పానీయాలు, సలాడ్లు, వైన్ వంటివి కూడా తయారు చేస్తారు. ద్రాక్ష ప్రాచీన కాలపు పంట. క్రీస్తుపూర్వం ఐదువేల ఏళ్లకిందటే ఈ పంట ఉంది. ద్రాక్ష రసం తాగడం వల్ల దాహం తీరడంమే కాకుండా రక్తవూపసరణ మెరుగుపడుతుంది. కిడ్నిలలో రాళ్లు ఏర్పడవు, ఆజీర్తి, మలబద్దకం తగ్గుతుంది. నోరు, గొంతు ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి. ఇందులో విటమిన్ సి. కె. తక్కువ.

పుచ్చకాయ
మన దేశంలో పుచ్చకాయ ఎక్కడ పుట్టిందో సరైన ఆధారాలు లేకున్నా ఐదువేల సంవత్సరాల క్రితం ఈజిప్టులో తొలిసారి పుచ్చను పండించినట్లు ఆధారాలున్నాయి. పుచ్చలో నీటిశాతం ఎక్కువ. అందుకే వేసవికాలంలో దీన్ని తినడం వల్ల శరీరానికి అవసరమైన నీటి శాతం అందుతుంది. ముదురు ఎరుపు లేక గులాబీ రంగు పుచ్చకాయలో కెరోటినాయిడ్స్, బీటాకెరోటిన్లు పుష్కలంగా దొరుకుతాయి. వీటిని మన శరీరం ఎ-విటమిన్లుగా మార్చుతుంది. విటమిన్- బి 6, సీ, పీచు పదార్థాలు కూడా పుచ్చలో ఉన్నాయి. సుక్రోజ్, ప్రక్టోజ్, గ్లూకోజ్ కూడా ఎక్కువే. మూత్రంలో యూరిక్ అమ్లాన్ని తగ్గించడంలోనూ, గుండె సంబంధ వ్యాధుల నివారణలోనూ పుచ్చకాయ ఉపయోగపడుతుంది.

మామిడి రసం
ప్రపంచమంతా మక్కువ చూపే ప్రధాన ద్రవం మామిడి రసం. ఇది అన్ని ప్రాంతాల్లోనూ పండుతుంది. వేసవికాలంలో పండే మామిడిపండ్ల నుండి రసాన్ని తీసి జ్యూస్‌గా అమ్ముతారు. నీటి శాతం ఎక్కువగా ఉండడం వల్ల దాహం తీర్చే పండ్లుగా ఉపయోగపడుతున్నాయి. మామిడిలో చక్కెర, మాంసకృత్తులు, ఎ,బి,సి విటమిన్‌లు ఉన్నాయి. మామిడి రసాన్ని ప్రత్యేకంగా తయారు చేసిన ప్యాకెట్లు, సీసాలలో పెట్టి శీతల పానీయాలుగా విక్రయిస్తున్నారు.

బత్తాయి రసం
నిమ్మకాయలను పోలి ఉండే బత్తాయిలు కూడా వేసవి తాపాన్ని తీరుస్తున్నాయి. బత్తాయిలో నీటిశాతం అధికంగా ఉండడం వల్ల వీటి నుండి రసాన్ని తీసి జ్యూస్‌గా అమ్ముతున్నారు. చక్కెర, విటమిన్ సి ఎక్కువగా ఉండడం వల్ల శరీరానికి ఇవి ఎంతో ఉపయోగకరం.
-ఇక ఇవన్నీ కూడా పండ్లు, సహజసిద్దంగా లభించే వేసవి పానీయాలైతే వివిధ రకాలుగా తయారైన శీతల పానీయాలు కూడా మార్కెట్‌ను ఏలుతున్నాయి. అనేక సంవత్సరాలుగా అందరికీ సుపరిచితమైన కోకాకోలా మొదలు, పెప్సీ, థమ్స్‌ఫ్, స్ర్పైట్, మిరిండా, మజా, ప్రూటీ, లిమ్కా వంటి వెన్నొ ఎండాకాలంతో సంబంధం లేకుండా మార్కెట్‌ను తమ వశం చేసుకున్నాయి.

మర్యాదల్లో తేడా 
ఇంటికి బంధువులు వస్తే తాగడానికి నీళ్లు, మజ్జిగ ఇచ్చే దశ దాటి టీ, కాఫీల దశకు చేరింది. ఇప్పుడు ఈ దశలోనూ పూర్తిగా మార్పువచ్చింది. ఇంటికి వచ్చే బంధువులకు శీతల పానీయాలు తెప్పించి వారిని సంతృప్తి పరచడం నేటి సంప్రదాయంగా రూపాంతరం చెందింది. దీంతో సహజ పండ్లరసాలకు ఆదరణ తగ్గి వివిధ రకాల రసాయనిక పదార్థాలతో తయారైన శీతల పానీయాలకే మనవాళ్లు జై కొడుతున్నారు. దీంతో సహజ ఉత్పత్తులు కనుమరుగయ్యే ప్రమాదం పొంచివుంది.

కడుపు ‘చల్ల’గా ఉండేది!
ఒకప్పుడు ఇంటికి వచ్చే బంధువులకు తాగడానికి మజ్జిగ ఇచ్చే సంస్కృతి ఉండేది. ముఖ్యంగా వేసవికాలంలో ఎండలో వచ్చేవారికి మజ్జిగ ఇవ్వడం వల్ల కొంత ఉపశమనం లభించడంతో పాటు కడుపులో చల్లగా ఉంటుందని భావించేవారు. ఎండపూట చల్లదనాన్నిస్తుందన్నది వారి నమ్మకం. అందుకే మజ్జిగను ‘చల్ల’ అని కూడా పిలుస్తారు. అయితే ఇప్పుడా సంస్కృతి లేకుండా పోయింది. పూర్వం పాడిలేని ఇల్లు లేకుండేది. ప్రతి ఇంటిలో కనీసం ఒక పాలిచ్చే ‘బర్రె’ ఉండేది. దీనివల్ల పాలు, పాలు తోడెయ్యడం వల్ల పెరుగు, పెరుగును చిలకడం వల్ల మజ్జిగ ఉండేవి. మజ్జిగనుండి వెన్నను తీసేయ్యడం వల్ల మజ్జిగ తాగినప్పటికీ ఎలాంటి కొవ్వుపదార్థాలు శరీరంలోకి చేరే అవకాశం ఉండేది కాదు. ఇంటికి వచ్చిన అతిధిగా వచ్చిన వారికి దాన్నే తాగడానికి ఇచ్చేవారు. ఆధునిక కాలంలో వేగవంతమైన మార్పుల్లో ఇప్పడు చల్ల ఇచ్చేవారే లేరు.

తాటి ముంజలు
వేసవికాలంలో గ్రామీణ ప్రాంతాల్లో విరివిగా కనిపించేవి తాటి ముంజలు. తాటి చెట్టునుండి తీసే ఈ ముంజలు వేసవికాలంలోనే వస్తాయి. అంటే లేతగా ఉన్న తాటికాయలన్న మాట. ఒక్కో కాయలో రెండు మూడు కన్నులుంటాయి. ప్రతీ కన్నులో తెల్లని గుజ్జులాంటి పదార్థం ఉంటుంది. ఇది తియ్యగా ఉండి దాహాన్ని తీరుస్తుంది. లేతగా ఉన్న గుజ్జులో తియ్యని ద్రవం కూడా ఉంటుంది. అచ్చు కొబ్బరినీటిని తలపించే ఈ ముంజలను నగరాల్లోనూ అమ్మకానికి పెడుతున్నారు.

No comments:

Post a Comment