Tuesday, May 20, 2014

తెలుగు వారికి మాత్రమే గల ప్రత్యేకతలు

 తెలుగు వారికి మాత్రమే సొంతమైన కొన్ని ప్రత్యేకతలు, అవి చాలా ఉండొచ్చు

తెలుగు భాష: గొప్ప చెప్పుకోకూడదు కానీ, అసలు తెలుగు భాషే తీయనైనది, కమ్మనైనది. అందుకే రాయల వారు 'దేశ భాషలందు తెలుగు లెస్స' అని తెలుగు విశిష్టతను చెప్పకనే చెప్పారు. గోదారి గలగలలు, కృష్ణమ్మ ఉరవళ్ళు కలగలిపి, కొంచెం తేనె, కొంచెం పంచదార కలిపితే అది తెలుగు భాష అవుతుందని ఒక కవి హృదయం.

నాటకాల్లో పద్యాలు: తెలుగు వారి నాటకాల్లో ప్రత్యేకత పద్యాలు. 'బావా ఎప్పుడు వచ్చితీవు' అని రాయబారం పద్యం ఆలపించినా, 'చెలియో చెల్లకో' అంటూ హరిశ్చంద్ర కాటిసీను పద్యం ఆలపించినా, తెలుగు వారు మైమరచిపోతారు. ఒకసారి ఒకటో కృష్ణుడు పద్యం ఆలపించి, దాని చివర ఆ..ఆ......ఆ........ఆ....... అంటూ రాగం ఆలపించడం మొదలు పెడితే ఇక నాటకం పూర్తయే సరికి తెల్లారిపోవలసిందే. తెలుగు అజంత భాష అవ్వడం వలన పద్యం చివర రాగం తీసినా మధురంగానే ఉంటుంది.

రీ వెంకటేశ్వరుడు / అన్నమయ్య కీర్తనలు : తెలుగు వారికే ప్రత్యేకమైన ఇష్ట దైవం తిరుపతి శ్రీ వేంకటేశ్వరుడు. అందరు దేవతలకి అన్ని చోట్ల దేవాలయాలు ఉండొచ్చు గాని, సాక్షాత్తు విష్ణువు వేంకటేశ్వరునిగా కొలువై వున్న తిరుమల గిరి తెలుగు వారి వరాల కొండ. 'ఎలమి కోరిన వరాలిచ్చే దేవుడే' అంటూ ఆ స్వామిని నోరారా కీర్తించిన అన్నమయ్య కీర్తనలు మనకు మాత్రమే సొంతం. 'చందమామ రావే, జాబిల్లి రావే' అంటూ అచ్చ తెలుగు సొగసులద్దిన అన్నమయ్య మన తెలుగు వాడు కావడం మనం చేసుకున్న అదృష్టం కాక మరేమిటి?

వేమన పద్యాలు: చిన్న చిన్న పద్యాలలో కొండంత భావాన్ని పొదిగిన వేమన పద్యాలు జీవిత సారాన్ని విశదీకరిస్తాయి. వేయి మాటల్లో చెప్పలేని విషయాన్ని నాలుగు వరుసల్లో చెప్పగలగడం, అదీ అతి చిన్న తెలుగు వాక్యాల్లో ఇమిడిపోవడం తెలుగు భాష గొప్పదనమైతే, అలా ఇమడ్చగలగడం వేమనకే సాధ్యం. తెలుగు వారి హృదయాలలో వేమన స్థానం ఎప్పటికీ పదిలం.

చీర / పంచెకట్టు: భారతదేశంలో ఎక్కడికైనా వెళ్లండి, ఆ మాటకొస్తే ప్రపంచంలోనే ఎక్కడికైనా వెళ్ళండి. అచ్చ తెలుగు వాళ్ళని ఇట్టే పసిగట్టవచ్చు. తెలుగు వారి పంచెకట్టు, ఆడవారి చీరకట్టు జగత్‌ ప్రసిద్ధమైనది. పంచె కట్టుకుని, నుదుటన బొట్టు పెట్టుకుని, భుజాన ఉత్తీరీయం వేసుకుని తెలుగు పెద్దాయన నడిచి వెళుతుంటే, అప్రయత్నంగా చేతులు జోడించ బుద్దేస్తుంది. అలాగే చీర కట్టులో మగువ అందాన్ని వర్ణించడం మహాకవులకయినా సాధ్యం కాదేమో కదా..

No comments:

Post a Comment