Tuesday, May 20, 2014

హిప్నాటిజం అంటే ఏంటి.. ఎవరు కనిపెట్టారు?

హిప్నాటిజం అనే మాటను తరచుగా మనం వింటుంటాం. అసలు హిప్నాటిజం అంటే ఏమిటి? దీనిని ఎవరు కనిపెట్టారు.? ఎలా పని చేస్తుంది? ఎందుకు ఉపయోగిస్తారు? అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

హిప్నాటిజం అంటే... ఎదుటివారిని సమ్మోహనపరిచే విద్య. మాటల ద్వారా, కంఠస్వరం ద్వారా ఎదుటివారి మనస్సుపై ప్రభావాన్ని కలుగజేసి... వారి మనస్సులపైన శరీరంపైనా వారికి ఆధీనం తప్పింపజేయడమే హిప్నాటిజం. అలా ఆధీనం తప్పిన వ్యక్తులు నిద్రావస్థలోకి వెళ్ళి తమకు తెలియకుండానే హిప్నాటిస్ట్ ఏం చేయమంటే అది చేస్తారు.

హిప్నాటిజం ద్వారా వ్యాధులను నయం చేసే పద్దతిని జర్మన్ దేశస్థుడైన 'ఫెడరిక్ ఆంటోన్ మెస్మర్' కనిపెట్టాడు. అందుకనే దీన్ని 'మెస్మరిజం' అని కూడా అంటారు. అయితే ఇంగ్లండ్ దేశానికి చెందిన డాక్టర్ జేమ్స్ బ్రెయిడ్ ఈ హిప్నాటిజానికి శాస్త్రీయస్థాయిని కల్పించాడు. ముఖ్యంగా... శారీరక, మానసిక వ్యాధులను నయం చేయడానికి 'హిప్నోథెరఫీ' ఎక్కువగా వాడుకలోకి వచ్చింది. 

భారతదేశం విషయానికి వస్తే... డాక్టర్ ఎన్ డైలే అనే ఆంగ్లవైద్యుడు హిప్నాటిజం వ్యాప్తికి విశేషంగా కృషి చేశాడు. ఆయన 19వ శతాబ్దంలో రోగులను హిప్నటైజ్ చేసి, వారికి ఏ మాత్రం నొప్పి కలగని విధంగా అనేక శస్త్ర చికిత్సలు (ఆపరేషన్) చేశాడు. మత్తు మందు ఇచ్చి రోగులకు ఆపరేషన్ చేసే విధానాన్ని అప్పటికింకా కనిపెట్టని కాలంలోనే ఆయన పై విధంగా హిప్నటైజ్ చేసి ఆపరేషన్లు నిర్వహించేవాడు.

ఆపరేషన్ పూర్తయిన తర్వాత రోగులను ప్రశ్నిస్తే... వారు తమకు ఎలాంటి నొప్పీ కలుగలేదని చెప్పారట...! ఇక అప్పటి నుండి అదే హిప్నటైజ్ పద్ధతిని అనుసరించిన ఎన్ డైలే ఆ కాలంలోనే ప్రపంచవ్యాప్తంగా నొప్పిలేని విధంగా 300 ఆపరేషన్లను చేసి సంచలనం సృష్టించాడు.

అయితే ఈ హిప్నటైజ్ పద్ధతి ద్వారా హిప్నటైజ్ చేసే వ్యక్తి నేరాలు చేయదలచుకుంటే... తన వశీకరణకు లోబడిన వారిని దీర్ఘసుషుప్తిలోకి తీసుకెళ్ళి తన ఇష్టం వచ్చినట్లు చేసే ప్రమాదం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే 1952వ సంవత్సరంలో బ్రిటీష్ ప్రభుత్వం హిప్నాటిజం చట్టాన్ని రూపొందించింది.

No comments:

Post a Comment