Tuesday, May 20, 2014

ఆయుర్వేదం

ఆయుర్వేదం అతి ప్రాచీనమైన భారతీయ వైద్య విధానం. ఆంగ్లేయుల పరిపాలన ఫలితంగా దేశంలో అల్లోపతి బాగా ప్రబలి ఆయుర్వేదానికి గల గౌరవం, ప్రసిద్ధి క్షీణించిపోయాయి. కానీ, ఈనాటికీ ఈ వైద్య విధానం పట్ల అపార నమ్మకంగల వారు ఎందరో ఉన్నారు. 

ఆయుర్వేదం అనగా "ఆయుర్వేత్తీతి ఆయుర్వేద:" ఆయ్యుర్దాయమును తెలుసుకొనునది ఆయుర్వేదము. ఇది వేదములందలి ఒక భాగం.మానవునికి సామాన్యంగా శరీరంలో త్రిదోషముల వృద్ధి, క్షయము వలన ఆరోగ్యము చెది రోగాలు సంభవిస్తాయి. శరీరంలో త్రిదోషాల ప్రకోపం వల్ల కలుగు రోగాలను నిరోధించి దోష ప్రకృతిని సమస్థాయిలో ఉంచి ఆరోగ్యాభివృద్ధి కలిగించడమే ఆయుర్వేదం యొక్క సారాంశం. ఆయుర్వేద వైద్యులు మానవ శరెరంలో వాత, పిత్త, కఫ దోషాల వృద్ధి క్షయాల వల్ల రోగాలు కలుగుతాయని నిర్ణయించారు. మానవ శరీరంలోని వాత, పిత్త, కఫ దోషాలలో ఏ ఒకటి ప్రకోపించినా రోగం అంకురిస్తుంది. శరీరంలో దోషాల వృద్ధి, క్షయాలు అనేక కారణాల వల్ల కలుగవచ్చు. శారీరకంగా, మనసికంగా, వాచకంగా అత్యధిక ఇంద్రియాసక్తత వలనగాని, ఇంద్రియాసక్తత లోపించుట వలనగాని అనుచితమైన ఇంద్రియాసక్తత వలనగాని రోగాలు సంభవించవచ్చు. ఋతువులు మార్పులు చెందేటప్పుడు రోగాలు రావచ్చు. 

ఆయుర్వేద లక్షణా లక్షితుడైన వైద్యుడు నిదాన విధిచే వ్యాధి కారణములని, దాని స్వరూపముని, సాధ్య, అసాధ్యములను గ్రహించి, రోగి యొక్క ప్రకృతిని అనుసరించి, రోగి యొక్క జీవన విధానమునకు కారణములని, వృత్తి వ్యాపార, నివాసాదులను తెలుసుకుని రోగియొక్క నాడీ విధానమును పరీక్షించి రోగియొక్క రోగముని నిర్ణయిస్తాడు. 

మానవ శరీరానికి కారణభూతమైన ప్రకృతులకు, శరీరానికి తీవ్రంగా నిరంతరం పరస్పరం అంతర చర్య జరుగుతుందని ఆయుర్వేదం నమ్మిక. ఆయుర్వేద వైద్యుడు వ్యాధి ఉత్పత్తి కారణాలను సాధ్యాసాధ్యాలను తెలుసుకుని చికిత్స ప్రారంభిస్తాడు. ఔషధ ప్రయోగానికి మొక్కల ఆకులు, మూలికలు, లోహాలు, ధాతువులు మొదలగు ప్రకృతి ప్రసిద్ధములైన వాటిని ఉపయోగించి చేసిన భస్మములు, కుష్టుములు, ఆరిష్టములు, గుళికలు వాడి రోగ నివృత్తి కరిగించి ఆరోగ్యాన్ని సమకూర్చి, త్రిదోషాలను సమస్థాయిలో ఉంచుతాయి. 

రోగాలకు ముఖ్య కారణమైన సూక్ష్మజీవులు లేవని ఆయుర్వేద వైద్యులు నమ్మకపోరు. సాధారణంగా అలోపతి వైద్యులు ఒక ప్రత్యేక రోగానికి కారకమైన సూక్ష్మజీవులను నిర్ణయించి వాటిని నశింపజేస్తారు. కాని ఆయుర్వేదంలో రోగి రోగం రావడానికి సంసిద్ధుడై ఉంటాడని, ప్రేరేపకత్వం లేకుండా ఏ సూక్ష్మజీవి రోగికీ ఎంత మాత్రం హాని కలిగించదని అభిప్రాయపడతారు. 

ఒక రోగంతో బాధపడుతున్న రోగియొక్క పరిపూర్ణ తత్వాన్ని గ్రహించి చికిత్సకు పూనుకొనుటయే ఆయుర్వదం యొక్క ప్రత్యేకత. ఆయుర్వేదమ్నందు ఔషధ ప్రక్రియ, శస్త్ర ప్రక్రియ, శిరో రోగ ప్రక్రియ, చిత్త భ్రమ మానసిక రోగ ప్రక్రియ, ప్రసూతి వైద్య మరియు శిశు వైద్య ప్రక్రియ, విష వైద్య ప్రక్రియ, కాయకల్పము, నాజీకరణము అనే 8 ప్రక్రియలుంటాయి. అందుచేతనే అష్టాంగ ఆయుర్వేదమని దీనికి పేరు. ఆయుర్వేద వైద్య విధానంలో రోగి తీసుకోదగిన, తీసుకోకూడని ఆహారములు, పథ్యాపథ్యములకు అత్యంత ప్రాముఖ్యత ఇవ్వబడింది. 

ఇంతేకాదు అయుర్వేదమందు ఆయు ప్రమాణమును వృద్ధిచేసుకొనుటకు అనుసరించవలసిన నిర్ణయములు, వ్యక్తిగత ఆరోగ్యము, పారిశుద్ధ్యము, పగటిపూట నిద్ర, ఆహార నియమము మొదలగు విషయములు వివరంగా చర్చించబడినవి. 

సక్రమ వ్యాయామము, పగలు, రాత్రి ఆహారముల మధ్య తిరిగి తినకుండుట, పొగ త్రాగడం మానివేయుట, మత్తు పదార్ధాలు సేవించకుండుట మొదలగునవి ఆయు ప్రమాణమును వృద్ధిచేయునవి ఆయుర్వేద శాస్త్రం నిర్ణయించింది. మానసికోద్రేకాల వల్ల కొన్ని రోగాలు సంభవిస్తున్నది ఆయుర్వేదం యొక్క మరో విశేషం. 

చరకుని సిద్ధాంతం : పరిశుద్ధమొనర్చుట, ఉపశాంతి కల్గించుట, రోగ కారణాన్ని నిర్మూలించుట ఇదే చరకుని ఆయుర్వేద సిద్ధాంతం యొక్క ముఖ్య ధర్మం. ప్రాచీన కాలమునుండీ రోగ నివృత్తికీ, ఆరోగ్యాభివృద్ధికీ ఈ సిద్ధాంతమునే అనుసరిస్తున్నారు. 

ఆయుర్వేద వైద్య విధానమునకు సంబంధించినవే యునాని, సిద్ధ వైద్య విధానములు. అంధుబాటులో ఉంటే ఆయుర్వేద వైద్యం ఆరోగ్యానికి మహాభాగ్యం.

No comments:

Post a Comment