Friday, May 18, 2012

గుడ్లు తింటే బ్రెస్ట్ క్యాన్సర్ తగ్గే అవకాశం..

గుడ్లు వంటి బలవర్థక ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటే మహిళలలో రొమ్ము క్యాన్సర్‌ వచ్చే అవకాశం గణనీయంగా తగ్గుతుందని తాజా అధ్యయనం పేర్కొంది. గుడ్ల వినియోగానికి, బ్రెస్ట్ క్యాన్సర్‌కి మధ్య సంబంధాన్ని నిరూపించే అదనపు సాక్ష్యాన్ని ఈ కొత్త అధ్యయనం బయటపెట్టింది.

ఉత్తర కరోలినా యూనివర్శిటీకి చెందిన స్టీవెన్ జైసెల్ అధ్వర్యంలో జరిగిన ఈ వ్యాధి నివారణ అధ్యయనానికి గాను దాదాపు 3 వేలమంది మహిళలను పరిగణనలోకి తీసుకున్నారు. బి కాంప్లెక్స్ విటమిన్‌ను కలిగివుండే కోలైన్ పదార్థం ఎక్కువగా ఉండే గుడ్లను ఆహారంలో తీసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు 24 శాతం తగ్గిపోతాయని ఈ అధ్యయనంలో తేలింది.

కోలైన్ పదార్థాన్ని అధికంగా తీసుకున్న మహిళలు సగటున రోజుకు 455 మిల్లీ గ్రాముల కోలైన్‌ను వినియోగించారని, వీరు కాఫీ, గుడ్లు, స్కిమ్ మిల్క్ వంటి వాటిని ఎక్కువగా వాడుతూ వచ్చారని స్టీవెన్ తెలిపారు. అలాగే రోజుకు సగటున 196 మిల్లీ గ్రాముల కంటే తక్కువ కోలైన్‌ను తీసుకునే మహిళలను సైతం ఈ అధ్యయనంలో పరీక్షించినట్లు చెప్పారు.

కణాలు సాధారణ రీతిలో పనిచేసేందుకు కోలైన్ చాలా అవసరం. వయసు, లింగంతో పనిలేకుండా ప్రతి ఒక్కరూ కోలైన్ అధికంగా ఉండే పదార్ధాలను తీసుకోవచ్చు. మహిళలకు, ప్రత్యేకించి పిల్లలను పెంచే వయసులో ఉన్న మహిళలకు ఇది చాలా అవసరమని జైసెల్ పేర్కొన్నారు.

మనం తీసుకునే ఒక గుడ్డులో కనీసం 125.5 మిల్లీ గ్రాముల కోలైన్ ఉంటుంది. రోజూ మనం తీసుకోవాల్సిన కోలైన్ శాతంలో ఇది పావుభాగం అన్నమాట. అందుకే ఆహారంలో తప్పనిసరైన ఈ పోషక పదార్థాన్ని పొందాలంటే గుడ్లు తినడం చాలా అవసరం. గుడ్డులోని పచ్చసొనలో కోలైన్ అధికంగా ఉంటుంది. ఇకపోతే కాలేయం, గోధుమ మొలకలు, కాలిఫ్లవర్స్‌లో కూడా తగుమాత్రంలో కోలైన్ ఉంటుంది.

అయితే మనుషుల ఆహారంలో కోలైన్ తప్పనిసరి బలవర్థక పదార్థంగా ఉన్నప్పటికీ, చాలామందికి దీని గురించి కనీసం తెలియదని స్టీవెన్ పేర్కొన్నారు. రోజువారీ ఆహారంలో ఎంత కోలైన్ తీసుకోవాలో అమెరికన్ ప్రజలకు తెలియజేయవలసి ఉందని తెలిపారు.

కణాల సాధారణ పనితీరులో కోలైన్ కీలక పాత్ర వహించడమే గాదు... మెదడు, నరాలు, కాలేయ జీవ రసాయన ప్రక్రియ పనితీరును కూడా ప్రభావితం చేస్తుంది. పైగా శరీరమంతటా పోషకపదార్థాలను సరఫరా చేయడంలో కూడా ఇది ఉపకరిస్తుంది. పుట్టుకతో వచ్చే లోపాలను నివారించడమే కాక, మన జ్ఞాపకశక్తిని కూడా మెరుగు పరుస్తుందని స్టీవెన్ జైసెల్ తెలిపారు.

ఈ అధ్యయనం అమెరికా మహిళలను ఉద్దేశించి చేపట్టిందే అయినప్పటికీ ప్రపంచంలో మహిళలందరికీ ఇది వర్తిస్తుంది కాబట్టి కోలైన్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడంపై ప్రచారం చేయవలసిన అవసరం ఉంది కదూ..

No comments:

Post a Comment