Wednesday, June 19, 2013

వానకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

దగ్గినా, తుమ్మినా.. చేతుల్ని అడ్డు పెట్టుకుంటాం. అయితే ఆ తరువాత చేతుల్ని తుడిచేసుకుంటే సరిపోదు. కానీ అలా అడ్డుపెట్టుకున్నప్పుడల్లా సబ్బునీటిలో చేతుల్ని శుభ్రంగా కడుక్కోవాలి. అప్పుడే క్రిముల సమస్య ఉండదు. అయితే చేతులపై దగ్గు, తుమ్ము తాలూకు తుంపర్లు పడకుండా టిష్యూ వాడితే మరీ మంచిది. అలా వాడిన వాటిని ఎప్పటికప్పుడు పారేయాలి.

జలుబు ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. అందుకే.. అలాంటి సమస్య ఉన్నప్పుడు ముక్కు, నోరు, కళ్లను చేత్తో ముట్టుకోకపోవడమే మంచిది. మొటిమల సమస్య ఉన్నప్పుడు కూడా చేత్తో తాకడానికి ప్రయత్నించకూడదు.

క్రిములు చేతులపైనే కాదు... నోట్లోనూ ఉంటాయి. కాబట్టి ప్రతిరోజు రెండుసార్లు ఫ్లోరైడ్ ఉన్న టూత్‌పేస్టుతో పళ్లు తోముకోవాలి. నాణ్యమైన టూత్‌బ్రష్‌ను ఎంచుకోవాలి. దంతాల మధ్య ఇరుక్కున్న పదార్థాల్ని తొలగించేందుకు పిన్నులు, టూత్‌పిక్స్ లాంటివి కాకుండా నాణ్యమైన ఫ్లాస్‌ని ఎంచుకుని పుక్కిలించాలి.

క్రిములు చేరే స్థానాల్లో వంటిల్లు కూడా ఒకటి. అందుకే ప్రతి రోజు నాణ్యమైన డిస్ఇన్‌ఫెక్టంట్‌తో వంటిల్లు, ఇతర గదుల్ని తుడవాలి.

పరిశుభ్రమైన మంచినీటిని తాగకపోయినా కూడా సమస్య తప్పదు. అందుకే ఇంట్లోంచి బయటకు వెళ్తున్నప్పుడు తప్పనిసరిగా మంచినీళ్ల సీసా తీసుకెళ్లాలి. అలాగే జలుబుతో బాధపడుతున్నవారు వాడే మంచినీళ్లసీసాను తీసుకోకపోవడమే మంచిది.

ఈ కాలంలో ప్రయాణించాల్సి వస్తే కోసిన పండ్లు, కూరగాయ ముక్కలు, ఫ్రిజ్‌లో పెట్టని పాలు, పాల ఉత్పత్తులు, పండ్లరసాలు, బంగాళాదుంపలు, అన్నం వంటివి ఎంచుకోకూడదు. ఇలాంటి వాటిల్లో క్రిములు సులువుగా చేరతాయి. రోడ్డుప్రక్కన లభించే పదార్థాలను ఈ కాలమంతా మానేయడమే మంచిది. వెంట శానిటైజర్‌ను కూడా తప్పనిసరిగా తీసుకెళ్లాలి. ఎప్పటికప్పుడు చేతుల్ని శుభ్రం చేసుకోవడం సులువవుతుంది.

పిల్లలకు గాయాలైతే కట్టుకట్టడం మేలు. లేదంటే వాటిల్లో క్రిములు చేరి సమస్య మరింత పెద్దదవుతుంది. ప్రథమచికిత్స చేస్తే మరీ మంచిది.

చెత్తడబ్బాలపై మూత తప్పనిసరిగా ఉంచాలి. వీటినుంచే ఈగలు, దోమలు ఇంట్లోకి చేరుతాయి. ఎప్పటికప్పుడు చెత్తను ఖాళీచేసి, శుభ్రంగా కడిగి మూతపెట్టాలి.

ప్రతిరోజు కనీసం పదినిమిషాలు ఎండలో ఉంటే క్రిముల సమస్యను పూర్తిగా నివారించవచ్చు. ఎందుకంటే.. ఎండనుంచి విటమిన్ డి అందుతుంది. ఇది ఎండార్ఫిన్లను విడుదల చేస్తుంది. పరోక్షంగా శరీరం శక్తిమంతంగా తయారవుతుంది. అయితే.. ఉదయం ఏడుగంటల లోపల వచ్చే ఎండలో కూర్చుంటే అతినీల లోహిత కిరణాల ప్రభావం ఉండదు.

రోగనిరోధక వ్యవస్థ దృఢంగా పనిచేయాలంటే... క్రిములు, ఇన్‌ఫెక్షన్ల సమస్య ఉండదు. అందుకే... పండ్లు, కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి. అయితే వాటిని తినేముందు ఒకటికి రెండుసార్లు కడగడం మరవకూడదు.

No comments:

Post a Comment