Wednesday, June 19, 2013

మీ ఆరోగ్యానికి రక్ష.. గులాబీ రేకులు - అటుకుల కొబ్బరి

మనం ప్రతిరోజు తినే ఆహారంలో ఎంతో కొంత హాని కలిగించే పదార్థాలు ఉంటాయి. ఎలా అంటారా... మనం ఏ కూర చేసుకున్నా అందులో ఉప్పు, కారం, నూనె వేయకుండా చేయలేము కదా, కొందరైతే వీటి పరిమాణాన్ని కాస్త ఎక్కువ చేసి వాడుతారు, అలాంటి వాళ్ళకు ఏ జబ్బైనా ఇట్టే వచ్చేస్తుంది. అలాంటి వాళ్ళకోసం ఉప్పు, కారం తక్కువ మోతాదులో వేసి తయారుచేసిన ఆరోగ్యానికి ఔషధంలా పనిచేసే కొన్ని వంటకాలను మనం ఇప్పుడు చూద్దాం.

తీపి గులాబీ రేకులు: గులాబీ రేకులను తీసుకుని నీడలో ఆరబెట్టాలి, బాగా ఆరిన తరువాత వాటిని తేనెలో కాని బెల్లం పాకంలో గాని పదిరోజుల పాటు ఊరనివ్వాలి. తర్వాత తింటే చాలా రుచిగా ఉంటుంది. వీటిని తింటే రక్తహీనతను పోగొట్టి శరీరానికి రక్తం పట్టేలా చేస్తాయి.

వడపప్పు: పెసరపప్పును రెండు గంటలు పాటు నీటిలో నానబెట్టి, ఆ పప్పులో కొద్దిగా పచ్చిమిరపకాయలు, మిరియాలపొడి, శొంఠి పొడిని వేసి అందులో ఒక నిమ్మకాయను పిండితే చాలా రుచిగా ఉంటుంది. ఇది శరీరానికి బలాన్నిస్తుంది.

మూలికా కాఫీ: శొంఠి, తేనె, ధనియాలు, మిరియాలు, యాలకులు, ఇంకా దాల్చిన చెక్కలను సమానమైన పరిమాణంలో తీసుకుని కలపాలి, తర్వాత ఈ మిశ్రమాన్ని ఎండబెట్టి పొడికొట్టాలి. ఈ పొడిని కాఫీ పొడికి బదులుగా వాడాలి. చక్కెరకు బదులు బెల్లం వేసుకోవాలి, ఒక కప్పు కాఫీకి ఒక స్పూను పొడి వెయ్యాలి. ఇది తలనొప్పి, ముక్కుదిబ్బడ లాంటి సమస్యలకు మంచి ఫలితాన్నిస్తుంది. అంతేకాక జీర్ణశక్తిని కూడా పెంచుతుంది.

అటుకుల కొబ్బరి: మనకు కావలసినన్ని అటుకులను బాగా కడిగి నానబెట్టాలి. నానిన తర్వాత నీటిని వంపేసి, వాటిలో తగినంత కొబ్బరి తురుము, బెల్లమును చేర్చాలి, దీన్ని తింటే రుచిగా ఉంటుంది. ఇంకా శరీరానికి బలాన్ని ఇస్తుంది.

No comments:

Post a Comment